గెలిచినా... తెలుగు త‌మ్ముళ్ల గోలేందో?

Update: 2017-03-22 10:36 GMT
ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిలు అధికార పార్టీ టీడీపీ నేత‌ల‌కు పెద్ద‌గా క‌లిసి వ‌చ్చిన‌ట్లుగా లేదు. స్థానిక సంస్థ‌ల కోటాలో మొత్తం 9 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... ఆరింటిని ఏక‌గ్రీవం చేసుకున్న టీడీపీ... మిగిలిన మూడు స్థానాల‌ను వైసీపీకి స్ప‌ష్ట‌మైన బ‌ల‌మున్నా కూడా దొడ్డిదారిన ఎగుర‌వేసుకుపోయింద‌న్న విష‌యం జ‌నానికి ఇప్ప‌టికే అర్థ‌మైపోయింది. అయితే... విప‌క్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో జ‌రిగిన ఎన్నిక‌లో జ‌గ‌న్ బాబాయి - మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డిని ఓడించి బీటెక్ ర‌వికి ద‌క్కిన విజ‌యంపై మొన్న రెండు రోజుల పాటు తెలుగు త‌మ్ముళ్లు నానా హంగామా చేశారు. ఇక టీడీపీ అనుకూల మీడియా ఈ విష‌యాన్ని ఏకంగా ప‌దింత‌లు చేసి ప్ర‌చారం చేసేసింది.

అయితే ఆ వెనువెంట‌నే వెలువ‌డ్డ ఉపాధ్యాయ‌ - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి ద‌క్కిన ప‌రాజ‌యం టీడీపీ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంద‌నే చెప్పాలి. సాక్షాత్తు చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు ఇటు గ్రాడ్యుయేట్స్ స్థానానికి జ‌రిగిన ఎన్నికలో టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గిలింది. ఈ రెండు స్థానాలను కూడా వైసీపీ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థులే ద‌క్కించుకోవ‌డాన్ని టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇదిలా ఉంటే... త‌మ ఖాతాలో ప‌డిన స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీల విష‌యంలోనూ టీడీపీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైన‌ట్లుగా వారి మాట‌లే చెబుతున్నాయి. వాస్త‌వానికి ఏక‌గ్రీవం అయిన ఆరు స్థానాల‌ను ప‌క్క‌న‌బెడితే... వైసీపీ బ‌రిలో నిలిచి గ‌ట్టి పోటీ ఇచ్చిన క‌డ‌ప‌ - క‌ర్నూలు - నెల్లూరు స్థానా విష‌యానికి వ‌స్తే... అక్క‌డ టీడీపీకి బొటాబొటీ మెజారిటీనే ద‌క్కింది.

గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నికలు ముగిసిన త‌ర్వాత ఈ మూడు జిల్లాల్లో వైసీపీకి స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత టీడీపీ చేపట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ త‌ర్వాత ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు - ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. దీంతో అసెంబ్లీలోనే కాకుండా ఈ మూడు జిల్లాల్లోనూ వైసీపీకి ఎమ్మెల్యేల బ‌లం భారీగా త‌గ్గింద‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల విష‌యంలోనూ వైసీపీకి కాస్తంత బ‌లం త‌గ్గింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వైసీపీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ప్ర‌జా ప్ర‌తినిధులు టీడీపీలోకి జంప్ అయితే ఆ పార్టీకి బ‌లం త‌గ్గ‌డం మామూలేగా.

అయితే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌లువురు స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు తిరిగి త‌మ సొంత గూడు వైసీపీలోకి చేరిపోయారు. ఈ లెక్క‌ప్రకారం ఈ మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీల‌ను గెలిపించుకునేంత బలం త‌మ‌కుంద‌న్న భావ‌న‌తోనే వైసీపీ త‌న అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపింది. అయితే డ‌బ్బు ఎర‌గా వేసి క్యాంపులు నిర్వ‌హించిన టీడీపీ అతి క‌ష్టం మీద ఈ మూడు స్థానాల‌ను ద‌క్కించుకోగ‌లిగింది. ఈ విజ‌యంపై ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజే... క‌ర్నూలు ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి... మెజారిటీపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నెల్లూరులో గెలిచిన వాకాటి నారాయ‌ణ‌రెడ్డిది కూడా ఇదే వాద‌న‌.

ఇక గెలుపు ద‌క్కితే చాల‌న్న భావ‌న‌తో ఉన్న బీటెక్ ర‌వి మాత్రమే సంతోషం వ్య‌క్తం చేశారు. తాజాగా నేటి ఉద‌యం వెల‌గ‌పూడిలోని తాత్కాలిక అసెంబ్లీ స‌ముదాయం వ‌ద్ద మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఈ మెజారిటీతో చంద్ర‌బాబుకు ముఖం ఎలా చూపాలో కూడా అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో అక్క‌డి మీడియా ప్ర‌తినిధులు షాక్ తిన్నార‌ట‌. అయినా ప్ర‌లోభాల‌కు గురి చేసి గెల‌వ‌డం కూడా ఒక గెలుపేనా అన్న కోణంలోనూ కేఈ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News