ఆ వ్యూహ‌క‌ర్త‌పై బాబు బ్యాచ్ కేసు?

Update: 2017-08-12 04:36 GMT
అధికారంలో చేతిలో ఉంటే చాలు.. ర‌క‌ర‌కాల ఎత్తుల‌తో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌టం రాజ‌కీయాల్లో మామూలే. అదే త‌ర‌హా ప్ర‌య‌త్నాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్ కో చేస్తున్నారన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టుల‌పై టీడీపీ నేత‌లు కేసులు పెట్టించ‌టం ఇటీవ‌ల కాలంలో చూసిందే. ఒక‌వేళ‌.. త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న పోస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకునే బాబు స‌ర్కారు.. న్యాయంగా అయితే.. త‌మ ప్ర‌త్య‌ర్థుల్ని దెబ్బ తీసేలా ప్ర‌య‌త్నించే పోస్టులపైనా చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలి.

కానీ.. త‌మ‌కు న‌ష్టం వాటిల్లే వారిపై చ‌ర్య‌లు.. త‌మ‌కు లాభం చేకూర్చే వారిని చూసిచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ త‌మ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ కిశోర్ అలియాస్ పీకేపై పోలీసు కేసు పెట్టే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

సోష‌ల్ మీడియాతో త‌మ వాద‌న‌ను బ‌లంగా వినిపిస్తున్న పీకే బృందంపై కేసులు న‌మోదు చేయ‌టం ద్వారా ఒత్తిడి పెంచాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఇందులో భాగంగా కేసును ప‌క్కాగా త‌యారు చేసేందుకు వీలుగా కొన్ని వాద‌న‌ల్ని తెర‌పైకి తీసుకురావాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో వేలాది ఖాతాల్ని తెరిచి.. సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతున్నార‌న్న ఆరోప‌ణ‌పై కేసు క‌ట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్ప‌టం క‌నిపిస్తోంది. గ‌తంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఏ విధంగా నిర్వ‌హించారు? ఆ సంద‌ర్భంగా పీకే తీరును జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.
Tags:    

Similar News