ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌పై టీడీపీలో హాట్ డిబేట్‌

Update: 2016-04-13 16:49 GMT
పవర్ స్టార్.. జనసేనానిగా ఎప్పుడు రూపాంతరం చెందుతారు..? వచ్చే ఎన్నికల్లో జనసేనాని అడుగులు ఎటు వైపు వెళ్తాయి..? ప్రస్తుతం టీడీపీలో ఇదే అంశం చర్చనీయాంశమైంది. విభజన తర్వాత రాజకీయంగా కులాల సమీకరణాలకు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో పవన్ విషయంలో ఇప్పటి నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ..? అనే దిశగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గడచిన ఎన్నికల్లో కొన్నాళ్ల పాటు జనసేన అధినేతగా తెలుగు రాష్ట్రాల్లో హడావుడి చేశారు. ఓ పక్క మోడీ..మరో పక్క చంద్రబాబుతో జోడీ కట్టి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేశారు. అలాగే కాపు సామాజిక వర్గాన్ని ఈ కూటమి వైపు ఆకర్షితులయ్యేలా చేయడంలో చాలా వరకు సఫలీకృతులయ్యారు పవన్. అయితే ఆ తర్వాత సినిమా హడావుడిలో పడిపోయిన పవన్.. మళ్లీ పవర్ స్టార్ గా మారిపోయారు. అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తడం.. ప్రభుత్వాధినేతలతో చర్చించడం వంటివి మినహా.. ఇటీవల కాలంలో ఆయన ఏపీ రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేసిన సంఘటనలు లేవనే చెప్పాలి. దీంతో ఆయనలోని జనసేనాని తెర వెనుకకు వెళ్లారనే వాదనలూ వినిపించాయి. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోందంటూ ప్రకటించి మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపారు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన టీడీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గడచిన ఎన్నికల్లో తమతో కలిసి పని చేసిన పవన్ అడుగులు వచ్చే ఎన్నికల్లో ఎటువైపు పడతాయనేది ఈ చర్చ సారాంశం. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఉన్న కారణాల్లో పవన్ మద్దతు కూడా ఒకటనేది నిజం. ఎన్నికల అనంతరం చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యమిస్తూనే ఉన్నారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప‌లు సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా వెనక్కు తీసుకున్న సంఘటనలున్నాయంటున్నారు. అయితే జగన్‌ను కట్టడి చేయడానికే ఇదంతా నడిపారనే విమర్శలున్నా...చంద్రబాబు మాత్రం పవన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే విషయం స్పష్టం కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో పవన్ తమతో కలిసి వెళ్తారా..? లేక సొంతంగా పోటీకి దిగుతారా..? అనే చర్చ జరుగుతోంది.

అయితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి కాబట్టి.. పవన్ విషయంలో ఇప్పటి నుంచే విరోధంగా ఉండకున్నా.. ఓ కంట కనిపెడ్తూ ఉంటే సరిపోతుందంటున్నారు. ఇదే సమయంలో కులాల సమీకరణాలు జాగ్రత్తగా చూసుకుంటూ.. ఎవ్వరినీ నొప్పించని విధంగా వ్యవహరిస్తే ఇబ్బంది ఉండద‌ని నేతలు అట‌టున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కష్టమైనా సరే నెరవేర్చే దిశగా అడుగులేస్తే ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే ఎన్నికలను డీల్ చేయొచ్చనేది కొందరి అభిప్రాయం. ఇదే క్రమంలో పవన్‌తో రెగ్యులర్ గా ట‌చ్‌లో ఉండే కొందరి నేతలనూ జాగ్రత్తగా చూస్తూ ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ ప్రకటనపై చర్చ జరుగుతోంది. అయితే గతంలో పవన్ చేసిన ప్రకటనల్లాగానే.. దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ఛలోక్తులు విసురుకునే వారూ ఉన్నారు.
Tags:    

Similar News