సత్తెనపల్లి కి వంగవీటి?..బాబు ఉభయతారక మంత్రం

Update: 2020-03-04 14:30 GMT
మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగు దేశం పార్టీలో ఓ రకమైన నిస్తేజం అలముకుంది. పార్టీ అధికారంలో ఉండగా... తమదైన శైలిలో చక్రం తిప్పిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు తలలు పట్టుకుని కూర్చున్నారు. కొన్ని నియోజకవర్గాలకు అసలు ఇంచార్జీలే కనిపించని పరిస్థితి. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలోని కీలకమైన సత్తెనపల్లి కూడా ఒకటి. గతంలో స్పీకర్ గా వ్యవహరించిన దివంగత నేత కోడెల శివప్రసాద్ ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించగా... ఇటీవలే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గ బాధ్యతలు తీసుకునేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి. అదే సమయంలో కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ప్రచారంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణను అసలు ఏ నియోజకవర్గానికి పంపాలో తెలియని పరిస్థితి. అయితే ఈ రెండు సమస్యలను ఒకే దెబ్బకు పరిష్కరించే వ్యూహాన్ని చంద్రబాబు రచించారట. అదే... సత్తెనపల్లికి వంగవీటికి కేటాయించడమట.

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వంగవీటి... తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కావాలంటూ పట్టుబట్టారు. వైసీపీ నుంచి ఆయన ఎగ్జిట్ కు కూడా సెంట్రల్ నియోజకవర్గం దక్కకపోవడమేనని ప్రచారం సాగింది. అయితే టీడీపీలోకి వచ్చినా వంగవీటికి సెంట్రల్ దక్కలేదు కదా... అసలు ఎక్కడ కూడా పోటీ చేయకుండా అలా ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు చాలా ప్రతిపాదనలు ముందుకు వచ్చినా... ఏ ఒక్కటి కూడా వర్కవుట్ కాకపోవడంతో వంగవీటి సైలెంట్ గా ఉండక తప్పలేదు. అదే సమయంలో గత ఎన్నికల్లో సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా ఓ అసమ్మతి వర్గం బయలుదేరింది. కోడెలకు సీటిస్తే అసలు తాము పనిచేయమని కూడా పార్టీ కేడర్ అధిష్ఠానికి తేల్చి చెప్పేసింది. అయినా కూడా మంకుపట్టు వీడని కోడెల... తాను సత్తెనపల్లి నుంచి తప్పుకునేది లేదని తేల్చి చెప్పడంతో పాటు పట్టుబట్టి మరీ అదే నియోజకవర్గాన్ని ఇప్పించుకున్నారు. అయితే ఎన్నికల్లో కోడెలతో పాటు టీడీపీకి కూడా ఓటమి దక్కడంతో ఒక్కసారిగా సమీరణాలు మారిపోయాయి.

తాజాగా ఖాళీగా, ఏ నియోజకవర్గ బాధ్యతలు దక్కని వంగవీటిని సత్తెనపల్లికి పంపితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన రాగానే... పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు... ఈ ప్రతిపాదన పార్టీకి ఉభయ తారకంగా పనిచేస్తుందని, ఒకే దెబ్బకు రెండు కీలక సమస్యలు పరిష్కారమైనట్లుగా ఉంటుందని భావించి.. వెనువెంటనే ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గంలో ఏకంగా 30 వేలకు పైగా కాపు ఓట్లు ఉన్న నేపథ్యంలో... సత్తెనపల్లిని వంగవీటికి అప్పగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతేకాకుండా వంగవీటితో కలిసి పనిచేస్తామని కూడా అక్కడి పార్టీ కేడర్ చెప్పేసిందట. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ బాధ్యతలను నేడో, రేపో వంగవీటికి అప్పగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారన్న వాదనలు వినిసిస్తున్నాయి. ఇదే జరిగితే...సెంట్రల్ లో తిష్ట వేసుకుని కూర్చున్న బొండా ఉమామహేశ్వరరావు ఊపిరి పీల్చుకోవడంతో పాటుగా... సత్తెనపల్లికి ఓ బాధ్యుడు దొరికినట్టు అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News