టీడీపీది త‌ప్పే!... ఒప్పేసుకున్న చిన‌బాబు!

Update: 2019-02-11 08:39 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీ త‌ప్పు చేసింది. ఈ త‌ప్పు సాధార‌ణ త‌ప్పు కాదు. చారిత్ర‌క త‌ప్పు. రాష్ట్రాన్ని నిల్ల‌నిలువునా ముంచేసిన త‌ప్పు. ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టేసిన త‌ప్పు. అయితే ఈ త‌ప్పును నాలుగేళ్లుగా టీడీపీ గుర్తించ‌నే లేదు. అంతేకాదండోయ్‌... ఇది త‌ప్పే అయినా... ఇది త‌ప్పు ఎంత‌మాత్రం కాదు. ముమ్మాటికీ ఒప్పేన‌ని టీడీపీ స‌ర్కారే బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పింది. ఈ మాట ఎక్క‌డ చెప్పింద‌నుకుంటున్నారు? ఏపీ త‌ల‌రాత‌ను మార్చ‌డంలో కీల‌క భూమిక పోషించే శాస‌న స‌భ‌లో. అస‌లు దీనిని త‌ప్పంటే జైల్లో పెట్టేస్తాన‌ని కూడా టీడీపీ హెచ్చరిక‌లు జారీ చేసిన వైనం కూడా మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. అయినా ఈ త‌ప్పును త‌ప్పుగా గుర్తించేందుకు టీడీపీకి ఏకంగా నాలుగేళ్లు ప‌ట్టింది. స‌రే.. ఎన్నిక‌లు ముంచుకువ‌స్తున్న క్ర‌మంలో ఎలాగోలా ఈ త‌ప్పును త‌ప్పుగానే టీడీపీ ఒప్పేసుకుంది. ఈ మాట వెలువ‌డింది ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఏపీ మంత్రి నారా లోకేశ్ నోట నుంచే.

త‌న తండ్రి, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఢిల్లీ వేద‌క‌గా ఒక్క‌రోజు దీక్ష‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ దీక్ష‌కు ఇత‌ర పార్టీ నేత‌ల‌తో పాటు లోకేశ్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ టీడీపీ చేసింది త‌ప్పేన‌ని ఒప్పేసుకున్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తుంద‌న్న భావ‌న‌తోనే బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నామ‌ని లోకేశ్ చెప్పారు. అయితే నాలుగేళ్ల పాటు వేచి చూసినా... కేంద్రంలో అధికారంలోని బీజేపీ స‌ర్కారు ఏపీకి న్యాయం చేయ‌క‌పోగా... అన్యాయం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విధి లేని ప‌రిస్థితుల్లోనే ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో స్నేహానికి చెల్లుచీటి ఇచ్చామ‌ని లోకేశ్ చెప్పుకొచ్చారు. మొత్తంగా టీడీపీ ఓ పార్టీగా త‌ప్పు చేసింద‌ని, బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం తాము చేసిన త‌ప్పేన‌ని ఆయ‌న ఒప్పేసుకున్నారు. ఇక్క‌డే లోకేశ్ కు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

నాలుగేళ్ల పాటు బీజేపీతో క‌లిసి సాగిన కాలంలో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెప్పింది క‌దా. మ‌రి ఆ విష‌యాన్ని నాడు స్వాగ‌తించిన లోకేశ్... ఇప్పుడు అదే నిర్ణ‌యాన్ని ఎలా త‌ప్పుబ‌డుతున్నార‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. హోదాకు బ‌దులుగా ప్యాకేజీ ఇస్తామ‌ని కేంద్రం చెబితే... ఏకంగా అసెంబ్లీలో బీజేపీ స‌ర్కారుకు ధ‌న్య‌వాదాలు చెబుతూ చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తున్న కొంద‌రు... మ‌రి ఇప్పుడు క‌నిపించిన త‌ప్పు... నాడు ఎలా ఒప్పుగా క‌నిపించింద‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీకి అన్యాయం జ‌రుగుతున్న తీరు క‌ళ్లెదుటే క‌నిపిస్తున్నా... దానికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌కు దిగిన వారిని జైల్లో పెట్టిన టీడీపీ నేత‌లు ఇప్పుడు తామే దీక్ష‌ల‌కు దిగ‌డం ఏ త‌ర‌హా రాజ‌కీయ‌మ‌న్న వాద‌నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా తాము త‌ప్పు చేశామ‌ని ఒప్పుకున్న లోకేశ్ ఇప్పుడు విప‌క్షాల‌కు, ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇట్టే దొరికిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News