ఇటీవలే ప్రకాశం జిల్లా కు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పార్టీ మారబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున ఇటీవలి ఎన్నికల్లో నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేల్లో రవి ఒకరు. గత పర్యాయం ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గారు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రవి విషయంలో మళ్లీ ఇటువైపుకు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో వైసీపీలో గొట్టిపాటి రవికి జగన్ చాలా విలువను ఇచ్చారు. ఫిరాయింపుతో ఆయన ఆ విలువను పోగొట్టుకున్నారు.
ఇక ఇప్పుడు రవి వైసీపీలోకి చేరినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే షరతు ఉండనే ఉంటుంది. మరి అలాంటి ఉప ఎన్నికకే భయపడుతున్నాడో ఏమో కానీ.. తను తెలుగుదేశం పార్టీని వీడనంటూ గొట్టిపాటి రవి అంటున్నారట. తన క్వారీలపై అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయని, ఆఖరికి స్టాఫ్ ను కూడా లోపలకు రానివ్వడం లేదని. .అయినా తను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని గొట్టిపాటి అంటున్నారట. వెనుకటి రాజకీయాల్లో వీడమని అనే వాళ్లే త్వరగా పార్టీలు మారిన నేపథ్యం ఉంది. మరి గొట్టిపాటి రవి విషయంలో ఏం జరుగుతుందో!