పోరాడితే పోయేదేమీ లేదు...బానిస సంకెళ్లు త‌ప్ప!

Update: 2019-06-06 07:27 GMT
టీడీపీ నేత‌ - విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీ‌నివాస్ (కేశినేని నాని) వ్య‌వ‌హారం ఇంకా చ‌ల్లార‌న‌ట్టే క‌నిపిస్తోంది. వ‌రుస‌గా రెండో సారి విజ‌య‌వాడ నుంచి ఎంపీగా గెలిచిన నాని... పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యాల‌పై ఒకింత అసంతృప్తితో ఉన్నార‌ని నిన్న‌టిదాకా అనుకున్నాం గానీ... ఆ అసంతృప్తి మామూలుగా లేన‌ట్టుగానే ఉంది. పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌ద‌వుల‌కు సంబంధించి కేశినేని చాలా అసంతృప్తిగానే ఉన్నార‌న్న విష‌యం తెలిసిందే. త‌న‌కంటే జూనియ‌ర్లు అయిన కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు - గ‌ల్లా జ‌య‌దేవ్ ల‌కు కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు అస‌లు త‌న‌వైపే చూడ‌లేద‌న్న కోణంలో నాని కుత‌కుత‌లాడుతున్నట్లుగానే ఉంది.

అయితే ఆ అసంతృప్తిని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు... నానిని చ‌ల్ల‌బ‌రిచేందుకు లోక్ స‌భ‌లో పార్టీ విప్ ప‌ద‌విని ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అయితే ఆ ప‌ద‌వి త‌న‌కు వ‌ద్దంటూ నాని ముఖం మీదే చెప్పేశారు. ఈ క్ర‌మంలో నిన్న నానితో పాటు గ‌ల్లా జ‌య‌దేవ్ ల‌ను పిలిపించుకుని చాలా సేపు మాట్లాడారు. అంతేకాకుండా నాని పార్టీ మారుతున్న‌ట్లుగా వ‌చ్చిన వార్త‌లు కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే తాను పార్టీ మార‌డం లేద‌ని - ఒక‌వేళ చంద్ర‌బాబు వైసీపీలోకి వెళితే... తాను బీజేపీలోకి చేరిన‌ట్టేన‌ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు - త‌న‌కు త‌గ్గుతున్న ప్రాధాన్యం - పార్టీ ప‌ద‌వుల్లో త‌న‌ను అస్స‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం వంటి అంశాల‌తో రాత్రంతా బాగానే ఆలోచించిన నాని... నేటి ఉద‌యం తెల్లార‌గానే త‌న ఫేస్ బుక్ ఖాతాలో సంచ‌ల‌న కామెంట్ల‌ను పోస్ట్ చేశారు. పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు త‌ప్ప అన్న శ్రీ‌శ్రీ కామెంట్ల‌ను పోస్ట్ చేసిన నాని... మ‌రోమారు టీడీపీలో అల‌జ‌డినే సృష్టించారు. పార్టీ అధినేత‌తో మాట్లాడిన త‌ర్వాత అన్నీ స‌ర్దుకున్న‌ట్లుగానే అనిపించినా... ఈ పోస్ట్ ను చూసిన త‌ర్వాత నాని ఎంత‌మాత్రం మెత్త‌బ‌డ‌లేద‌ని - చాలా కీల‌క నిర్ణ‌యం దిశ‌గా ఆయ‌న సాగుతున్నార‌ని తెలుస్తోంది. ఈ నిర్ణ‌యం టీడీపీపై ఏ మేర ప్ర‌భావం చూప‌నుంద‌న్న అంశంపై అప్పుడు విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. పార్టీ అధినేత వైఖ‌రితో విసిగిపోయిన త‌ర్వాతే నాని ఈ కామెంట్లు పోస్ట్ చేసిన‌ట్లుగా కొన్ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... పొద్దుపొద్దున్నే నాని చేసిన కామెంట్లు టీడీపీలో పెను తుఫానునే సృష్టించ‌గా.... మ‌రోమారు ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారిపోయాయనే చెప్పాలి.


Tags:    

Similar News