గ్రేటర్ ప్రచారంలో శ్రీకాకుళం ఎంపీకి క్లాప్స్

Update: 2016-01-28 08:43 GMT
తెలుగుదేశం పార్టీ యువఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న ప్రచారానికి మంచి ఆదరణ వస్తోంది. ప్రచారంలో భాగంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు సెటిలర్లను ఆకట్టుకుంటున్నాయని తెలంగాణ టీడీపీ నేతలే అంటున్నారు.  ముఖ్యంగా కూకట్ పల్లి నియోజకవర్గ పరిధి లోని మూసాపేట - అల్లాపూర్ డివిజన్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. అక్కడ ఉత్తరాంధ్ర సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా ఉద్యోగాలకు సెలవు పెట్టి, పనులు మాని రామ్మోహన్ వెనుక ప్రచారంలో తిరిగారు.  గత మేయర్ ఎన్నికల్లో ఎర్రన్నాయుడు ప్రచారాన్ని గుర్తు చేస్తూ  రామ్మోహన్ నాయుడు స్థానికులను ఆకట్టుకున్నారు.

కాగా అప్పట్లో గెలిచిన కార్పొరేటరే ఇప్పుడు కూడా టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సెంటిమెంటు పరంగానూ ఎర్రన్నాయుడు ప్రచారంలా రామ్మోహన్ ప్రచారం తనకు కలిసొస్తుందని ఆయన అంటున్నారు.  అంతేకాదు... రామ్మోహన్ నాయుడును పూర్తిగా తన డివిజన్ కు వదిలేయాలని... మిగతా నేతలతో ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని ఆయన పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది.  మరోవైపు రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ మంత్రులు దేవినేని ఉమా, పుల్లారావు, అచ్చెన్నాయుడు, రావెల, అయ్యన్నపాత్రుడులు ప్రచారం చేసినా కూడా వారికి పెద్దగా ఆదరణ కనిపించలేదు. దీంతో ప్రచారం ముగిసేవరకు రామ్మోహన్ నాయుడును తమ డివిజన్లోనే ఉంచాలని అక్కడి అభ్యర్థి వేడుకుంటున్నారట. మరోవైపు రామ్మోహన్ కు లభిస్తున్న ఆదరణ చూసి ఉత్తరాంధ్ర సెటిలర్లున్న ఇతర ప్రాంత అభ్యర్థులు కూడా ఆయన్ను తమ డివిజన్లలో తిప్పాలంటూ పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారట.​
Tags:    

Similar News