టీడీపీ ఎంపీల కన్ను అసెంబ్లీపై..

Update: 2018-07-24 07:28 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త చిక్కొచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల విషయంలో ఇప్పటికే ఆశావహులు భారీగా ఉండగా వారికి కొత్తగా మరికొందరు చేరుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేలు - గత ఎన్నికలో ఓడిపోయినవారు.. వైసీపీ నుంచి ఫిరాయించినవారు.. ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న కొత్తవారు కలిసి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కోరుకుంటున్నవారు పెద్ద సంఖ్యలో ఉండగా.. వీరంతా చాలరన్నట్లుగా పార్లమెంటు సభ్యుల్లోనూ కొందరు ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తామంటూ చంద్రబాబు వద్ద ప్రతిపాదనలు పెడుతున్నారట. దీంతో చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో అసంతృప్తులు - రెబల్స్ బెడద తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
    
ఇప్పుడున్న ఎంపీల్లో అనకాపల్లికి ప్రాతినిధ్య వహిస్తున్న అవంతి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారట. మరో ఎంపీ మాగంటి బాబు కూడా శాసనసభపై మనసు పడుతున్నట్లు సమాచారం. రాయలసీమకు చెందిన సీనియర్ ఎంపీ  నిమ్మల కిష్టప్ప సైతం అసెంబ్లీపై కన్నేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా ఈసారి శాసనసభకే పోటీ చేస్తారని కృష్ణా జిల్లా టీడీపీ వర్గాలు చాలాకాలంగా చెబుతున్నాయి. వీరంతా మాత్రమే కాదు లోక్ సభలో టీడీపీ పక్ష నేత తోట నరసింహం కూడా ఈసారి పార్లమెంటుకు వెళ్లనని చంద్రబాబుతో ఇప్పటికే అన్నట్లు తెలిసింది.
    
మొన్నటి అవిశ్వాస పర్వంలో తోట నరసింహానికి ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదని ఆయన తీవ్రంగా మథనపడుతున్నారట. టీడీపీ ఫ్లోర్ లీడర్ తానే అయినప్పటికీ అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం కానీ, మాట్లాడే అవకాశం కానీ ఇవ్వకపోవడంతో ఆయన బాగా ఫీలయినట్లు సమాచారం. తన అసంతృప్తిని చంద్రబాబు వద్దే వెల్లగక్కినట్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే ఆయన తాను ఇక పార్లమెంటుకు పోటీ చేయబోనని... అసెంబ్లీకి పోటీ చేసి గెలుస్తానని... మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.
    
ఇక మిగతా ఎంపీలూ అసెంబ్లీపై మనసు పడడానికి కారణాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల తరువాత మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడుతుందన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. అదే కనుక జరిగితే మళ్లీ టీడీపీ బీజేపీతో సఖ్యంగా ఉన్నా ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకునే పరిస్థితేమీ ఉండదు. సో... ఎంపీలుగా గెలిచినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. అదే అసెంబ్లీకి పోటీ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడితే ఆయన్ను ఏదో రకంగా ఒత్తిడి చేసి మంత్రి పదవి సంపాదించుకోవచ్చన్నది చాలామంది ఆలోచన. నిమ్మల కిష్టప్ప వంటివారు ఎంతో సీనియర్లయినప్పటికీ పదవులు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తే ఈసారైనా మంత్రి కావాలన్నది ఆయన కోరికగా తెలుస్తోంది. మాగంటి బాబు కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఎన్నాళ్లుగా ఉన్నా పదవులు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అయితే ఒకవేళ సొంత ప్రభుత్వమేర్పడితే మంత్రి పదవి వస్తుందన్న కోరిక ఆయనలోనూ ఉన్నట్లు చెబుతున్నారు.
    
ఇదంతా గమనిస్తున్న వైసీపీ నేతలు మాత్రం మరో మాట చెబుతున్నారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోవడం టీడీపీ నేతల పిచ్చితనమని.. వచ్చేది వైసీపీ ప్రభుత్వం కాబట్టి టీడీపీ నేతల ఆశలు గల్లంతు కావడం గ్యారంటీ అని అంటున్నారు.
Tags:    

Similar News