టీడీపీకి అంది వచ్చిన అవకాశం...కొత్త ఎత్తులతో... ?

Update: 2022-03-03 00:30 GMT
రాజకీయాల్లో అవకాశాలు  ఎవరికి వారే సృష్టించుకుంటారు. వాటి కోసం వేట చేస్తారు. ఒక్కోసారి విసిగి వేసారి అలా వాటి కొరకు నిరీక్షిస్తూంటారు. అలాంటి అవకాశాలు తమకే అయాచితంగా లభిస్తే చూస్తూ ఊరుకుంటారా. అందునా వ్యూహాలకు తాత అయిన టీడీపీ ఈ విషయంలో ఖాళీగా ఉంటుందా. ఇపుడు టీడీపీకి అలాంటి బంపర్ ఆఫర్ తగిలింది. ఏపీలో వైఎస్ వివేకా దారుణ హత్య కేసు విషయంలో సీబీఐ దూకుడు, బయటకు వస్తున్న కీలక వ్యక్తుల  వాంగ్మూలాలు అన్నీ కలసి టీడీపీకి సరి కొత్త అస్త్రాలను అందిస్తున్నాయి.

దాంతో ఇప్పటిదాకా వైసీపీని టార్గెట్ చేసినది ఒక ఎత్తు అయితే ఇపుడు మరో విధంగా పొలిటికల్ గేమ్ ని మార్చేసింది టీడీపీ. జగన్ క్యారక్టర్ మీదనే సూటిగా  టీడీపీ గురి పెట్టేసింది. నిజానికి జగన్ వ్యక్తిత్వాన్ని పట్టుకుని హననం చేసే కార్యక్రమం 2009 నుంచే సాగుతూ వస్తోంది. అనాడు ఆయన  పెద్ద ఎత్తున ఆర్ధిక నేరాల్లో చిక్కుకున్నారని ఆరోపించింది. దాని మీద సీబీఐ కేసులు కూడా పడ్డాయి. లక్ష కోట్ల అవినీతిపరుడు జగన్ అని ఊరూ వాడా టీడీపీ తిరిగి ఊదరగొట్టింది.

అయితే అప్పటికే మారిన  కాలం  అవినీతి మీద పెద్దగా స్పందించే తీరుని మరచిపోయింది. దాంతో టీడీపీ బాణాలు వెనక్కి వచ్చేశాయి. అవినీతి మీద ఎంత అరచి గీ పెట్టినా ఫలితం మాత్రం టీడీపీకి దక్కలేదు. ఇక జగన్ విషయంలో క్రిమినల్ మైండ్ అంటూ మరో కొత్త ప్రచారానికి తెర తీసింది, ఫ్రాక్షన్ మెంటాలిటీ అని కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది.

అయితే వీటిని కూడా జనాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ ఇపుడు వివేకా హత్య విషయంలో వెలుగు చూస్తున్న సొంత వారి వాంగ్మూలాలతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. అటు వైపు నుంచి ఖండనలు ఉన్నా టీడీపీ మాత్రం ఈ వాంగ్మూలాలను తీసుకుని వైసీపీని మరింత కార్నర్ చేయాలని చూస్తోంది. జగన్ నైతికంగా పతనం అయ్యారని చంద్రబాబు విమర్శించడం వెనక కారణాలు ఇవే.

జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా టీడీపీ వేసిన భారీ స్కెచ్ కూడా ఇదే అంటున్నారు.  సొంత చిన్నాన్న హత్య విషయంలో ముఖ్యమంత్రిగా జగన్ పట్టించుకోలేదు అని ఇంతకాలం విమర్శలు చేస్తూ వచ్చిన టీడీపీ ఇపుడు మరి కాస్తా జోరు పెంచి జగన్ని సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా మహేశ్వరరావు అయితే తమిళనాడు ఒకప్పటి సీఎం జయలలితను విచారించిన తరహాలోనే జగన్ని సీబీఐ అధికారులు విచారించాలని కూడా గట్టిగా కోరుతున్నారు.

ఇక్కడ ఒక్కటే విషయం. జగన్ కి ఈ కేసులో సంబంధం అంటకట్టి ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయాలనుకోవడమే. అవినీతి ఆరోపణలు కంటే కూడా తాజా ఎపిసోడ్ లో వస్తున్న ఆరోపణలు బలమైనవి. పైగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే వారికి ఇవి బాగా కదిలిస్తాయి. మొత్తానికి మూడేళ్ళను తొందరలో పూర్తి చేసుకోబోతున్న వైసీపీ సర్కార్ కి వివేకా హత్య, సీబీఐ దర్యాప్తు, దూకుడుతో పాటు, టీడీపీ చేస్తున్న హడావుడి మాత్రం తీవ్రంగానే ఇబ్బంది పెడుతున్నానుకోవాలి. సీబీఐ ఏం చెబుతుంది అన్న దాని కంటే టీడీపీ చేస్తున్న ప్రచారమే ఇపుడు వైసీపీకి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు.
Tags:    

Similar News