బెజ‌వాడ రౌండ్ టేబుల్‌.. ఇందుమూలంగా తేలిందేంటంటే..!

Update: 2022-12-29 02:30 GMT
తాజాగా మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ వేదిక‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆధ్వ‌ర్యంలో `స్టేట్ స్పాన్స‌ర్డ్ టెర్ర‌రిజం.. సేవ్ ది స్టేట్‌` అనే నినాదంతో ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను(బీజేపీ, వైసీపీ మిన‌హా) కూడ‌గ‌ట్టి.. పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం దాదాపు 5 గంట‌ల పాటు నిర్విరామంగా సాగింది. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ తేల్చిందేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా.. వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల‌ని.. గ్రామ‌, జిల్లా, మండ‌ల స్థాయిలో అన్ని పార్టీలు క‌లిసి.. ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల‌ని తీర్మానం చేశారు. ప్ర‌భు త్వం అమ‌లు చేస్తున్న సంక్షేమంలోని రాజకీయాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి సీపీఐ, సీపీఎం, ఆప్‌, జ‌న‌సేన‌, జైభార‌త్ భీం, రైతు సంఘాలు(టీడీపీ మ‌ద్ద‌తున్న‌వి), పౌర సంఘాలు(క‌మ్యూనిస్టుల మ‌ద్ద‌తున్న‌వి) పాల్గొన్నాయి.

ఈ సంద‌ర్భంగా య‌ధాప్ర‌కారం వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇటీవ‌ల మాచ‌ర్ల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఒక ట్రైల్ ర‌న్‌గా నాయ‌కులు అభివ‌ర్ణించారు. ఈ సంద‌ర్భంగా పాత కేసుల విష‌యాల‌నే నాయ‌కులు ప్ర‌స్తావించారు. వివేకా హ‌త్య‌, కోడిక‌త్తి, అనంత‌బాబు డ్రైవ‌ర్ కేసు, ఆయేషా మీరా కేసుల‌ను ప్ర‌స్తావించి.. గంట‌ల కొద్దీ ప్ర‌సంగించారు.

మొత్తంగా ఈ రౌండ్ టేబుల్‌లో తేలింది ఏంటంటే.. వైసీపీ స‌ర్కారుపై అంద‌రూ ఉమ్మ‌డిగా పోరాటం చేయాల‌నే. ఇక‌, దీనిపై ఇప్పుడు విశ్లేష‌ణ‌లు చూస్తే.. దిమ్మ‌తిరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీకి ఆ పార్టీ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తోంది.

దీనిలో టీడీపీ ముందుంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కాన్ని స‌డ‌లించ‌లేక‌పోతోంద‌ని.. నాయకులు అనుమానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న శ‌క్తి చాల‌క‌.. ఇత‌ర పార్టీల బ‌లాన్ని కూడా త‌న‌కు ఇంజెక్ట్ చేసుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప్ర‌య‌త్న‌మైనా ఫ‌లిస్తుందా లేదా.. చూడాల‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News