చింత‌చ‌చ్చినా పులుపు చావ‌ని టీడీపీ..!

Update: 2020-03-13 15:30 GMT
ఒక‌వైపు స్థానిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేస్తున్న వైనం స్ప‌ష్టం అవుతూ ఉంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను త‌ప్పు ప‌ట్ట‌డంతోనే చంద్ర‌బాబు నాయుడు త‌మ ప‌రిస్థితిని చాటి చెబుతున్న‌ట్టుగా ఉంది. ఆడ‌లేక మ‌ద్దెల ఓటు అన్న‌ట్టుగా ఉంది చంద్ర‌బాబు తీరు. ఎన్నిక‌ల క‌మిష‌న్ మీద ఆయ‌న విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టి చాలా స‌మ‌యం అయిపోయింది. త‌మ వారిని నామినేష‌న్లు వేయ‌నీయ‌కుండా బెదిరిస్తున్నారంటూ చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు కూడా. అయితే తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున భారీగా నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయ‌ని, తాము ఎక్క‌డ అడ్డుకుంటున్న‌ట్టు? అని చంద్ర‌బాబు నాయుడును వైసీపీ నేత‌లు, మంత్రులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల నిస్పృహ‌తో ఉన్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్నంత ఉత్సాహం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు క‌నిపించ‌డం లేదనేది ప‌రిశీల‌కులు చెబుతున్న అంశం. పార్టీ అధికారంలో లేన‌ప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది నేత‌లు బ‌య‌ట‌కూ వెళ్లిపోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి గ‌ణ‌నీయంగా రాజీనామాలు న‌మోదు అవుతున్నాయి.

ఒక‌వైపు కీల‌క నేత‌ల‌ రాజీనామాల‌ తో తెలుగుదేశం పార్టీ వార్త‌ల్లో నిలుస్తూ ఉంది. అయితే మ‌రి కొన్ని చోట్ల మాత్రం పార్టీలోని నేత‌ల కొట్లాట‌లు ఆగ‌డం లేదు! ఇలాంటి వ్య‌వ‌హారంతోనూ వార్త‌ల్లోకి వ‌స్తోంది తెలుగుదేశం పార్టీ. అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో తీవ్ర విబేధాలున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే అక్క‌డ నేత‌లు తీవ్రంగా కొట్లాడారు. అప్ప‌ట్లో అనంత‌పురం ఎమ్మెల్యేగా ఉండిన ప్ర‌భాక‌ర్ చౌద‌రి, అనంత‌పురం ఎంపీగా ఉండిన జేసీ దివాక‌ర్ రెడ్డిల మ‌ధ్య‌న ర‌చ్చ మామూలుగా ఉండేది కాదు. ఎన్నిక‌ల్లో ఈ రెండు వ‌ర్గాలూ ఓట‌మి పాల‌య్యాయి. అయితే ఇప్పుడు అనంత‌పురం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యంలో ర‌చ్చ జ‌రుగుతూ ఉంది. అనంత‌పురం కార్పొరేష‌న్ డివిజ‌న్ల‌ విష‌యంలో త‌మ వ‌ర్గానికి ఎక్కువ టికెట్లు ద‌క్కాలంటే కాదు త‌మ వ‌ర్గానికి ఎక్కువ టికెట్లు ద‌క్కాల‌ని ఈ ఇరు వ‌ర్గాలూ కొట్లాడుతున్నాయ‌ట‌. అదేమంటే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ప్పుడు ఎమ్మెల్యే అభ్య‌ర్థి ప్ర‌భాక‌ర్ చౌద‌రి క‌న్నా, ఎంపీగా పోటీ చేసిన త‌న‌కే ఎక్కువ ఓట్లు వ‌చ్చాయంటూ వాదిస్తున్నార‌ట జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి.

మొత్తానికి చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు అన్న‌ట్టుగా... తెలుగుదేశం పార్టీ నేత‌ల రాజీనామాల‌తో ఇబ్బందుల పాల‌వుతున్నా, ఆ పార్టీలో ఉన్న వారి మ‌ధ్య‌న ర‌చ్చ‌లు అయితే త‌గ్గుతున్న‌ట్టుగా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News