టీడీపీ తీర్మానంలో బీజేపీని టార్గెట్ చేశారు!

Update: 2016-05-28 04:59 GMT
తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు మొద‌టిరోజు కీల‌క‌మైన ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-హామీల అమలు- ప్రత్యేక హోదాపై తీర్మానం సంచ‌ల‌నాత్మ‌కంగా ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. మ‌హానాడులోని మిగ‌తా తీర్మానాల కంటే ప్ర‌త్యేక హోదా తీర్మానం మొదటి నుంచి ఆస‌క్తిని రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా తీర్మానాన్ని పార్టీ నేత- చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాసులు ప్రవేశపెట్టి అనంత‌రం పార్టీ త‌ర‌ఫున‌ ప్రసంగించిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని అంటున్నారు.

రాజధాని లేక.. ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాల్సి ఉందని తీర్మానంలో ఈ తీర్మానంలో స్ప‌ష్టంగా  పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే సత్తా చంద్రబాబుకే ఉందని వెల్లడించారు. ప్రజా రాజధాని నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు అవసరమని కాల్వ పున‌రుద్ఘాటించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో ప్రత్యేక హోదాపైనే మాట్లాడుతున్నారని వివరించారు.  రెవెన్యూ లోటు భర్తీ కింద ఆర్థిక సాయం ఇంకా అందలేదని చాలా సార్లు కోరామని, రాష్ట్రానికి ఆర్థిక సాయంపై ప్రధానిని ఏ రాష్ట్ర సీఎం ఇన్నిసార్లు కలవలేదని కాల్వ శ్రీ‌నివాసులు చెప్పారు.

చట్టంలో ఉన్నవీ.. చెప్పినవే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని కాల్వ శ్రీనివాసులు స్ప‌ష్టం చేశారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో లేకపోయినా ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేక హోదాపై ప్రకటన చేశారని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఆదుకోవ‌డంలో వాస్త‌వ ప‌రిస్థితులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక హోదా అంశంలో తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్రబాబును విమర్శించే హక్కు వైసీపీకి లేదని ఆరోపించారు. రాష్ట్రానికి అందాల్సిన సాయంపై ఏనాడైనా జగన్‌ కేంద్రాన్ని కోరారా? అని కాలువ నిల‌దీశారు.

ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రం ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తీర్మానం చేయ‌డం ప‌ట్ల హ‌ర్హం వ్య‌క్త‌మవుతోంది. అదే స‌మ‌యంలో హామీ ఇవ్వ‌క‌పోయినా అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌ సింగ్ హోదాను ప్ర‌క‌టించార‌ని ప్ర‌త్యేకంగా గుర్తుచేయ‌డం ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వానికి సున్నిత‌మైన హెచ్చ‌రిక వంటిదేన‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. బీజేపీ-టీడీపీ సంబంధాల్లో నెల‌కొన్న ఇటీవ‌లి ప‌రిణామాల‌కు ఈ తీర్మానం అద్దంప‌ట్టింద‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News