ఇదేం ఖర్మ..బూమరాంగేనా...?

Update: 2022-11-22 10:30 GMT
ఇదేమి ఖర్మ అంటూ ఒక టైటిల్ ని ఇచ్చారు టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ. ఆయన ఆలోచనలు ఏంటి అంటే ఏపీలో వైసీపీ వారి పరిపాలన మహా దరిద్రంగా ఉందని, దాన్ని ఏ విధమైన సంకోచం సంశయం లేకుండా ఒకే ఒక్క మాటలో జనాల్లోకి సులువుగా మెసేజ్ పంపించవచ్చు అని. అయితే  ఇదేమి ఖర్మ అంటే అన్నవాడిది ఖర్మ లేక విన్నవాడిది ఖర్మ అన్న డౌట్లు వెంటనే వస్తున్నాయి.

గుజరాతీ అయిన రాబిన్ శర్మకు టైటిల్ క్యాచీగా పెట్టడమే తెలుసు కానీ దాని వాళ్ళ వాక్స్ పొలిటికల్  ఇంపాక్ట్ ఏంటో తెలియడంలేదు. దాంతోనే మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో కాస్తా తన  బుర్ర ఉపయోగించి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అని ఒక అర్ధం వచ్చేలా టైటిల్ సెట్ చేశారు.

దీంతో డిసెంబర్ ఫస్ట్ నుంచి ఏపీ అంతా రెండు నెలల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతీ ఇంటికీ తిరిగి అధికార వైసీపీ చేసే ప్రజా వ్యతిరేక పనులను వివరించాలన్నది రాబిన్ శర్మ వ్యూహం. దానికి పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో అంతా ఓకే చెప్పి ఆమోదముద్ర వేశారు.

అయితే ఈ టైటిల్ దాని ప్రోగ్రాం బయటకు రావడమేంటి జగన్ ఆ వెంటనే నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో ఒక్క లెక్కన ఏకి పడేశారు. ఇదేమి ఖర్మ బాబూ అనుకునే కదా ఏపీ జనాలు  23 సీట్లను ఇచ్చింది. ఇదేమి ఖర్మ అనుకునే కదా జనాలు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓడించింది అంటూ రివర్స్ లో జగన్ వేసుకున్నారు. దాంతో ఇపుడు ఈ టైటిల్ మీద టీడీపీలో అంతర్మాధనం మొదలైంది అంటున్నారు.

నిజానికి ఇదేమి ఖర్మ అన్నది నెగిటివ్ ఫీల్ ఇచ్చే టైటిల్. ఇది అవతల పార్టీ వారి మీద వ్యతిరేకత పెంచాలి. కానీ ఖర్మ అంటూ తెలుగు తమ్ముళ్ళే పదే పదే అనుకోవాల్సి రావడమే ఈ టైటిల్ ఖర్మ అవుతోంది. దాంతో ఈ టైటిల్ తో అతి పెద్ద ప్రోగ్రాం చేద్దామనుకుంటున్న టీడీపీకి ఆదిలోనే ఇది బూమరాంగ్ అవుతోందని కలవరం రేగుతోందిట.

కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లుగా ఈ టైటిల్ కి ఎవరికి తోచినట్లుగా వారు అర్ధాలు చెప్పుకోవచ్చు. ఇదేమి ఖర్మ అని తమ్ముళ్లు అంటే అవును టీడీపీతో ఇదేమి ఖర్మ అని వైసీపీ వారు రివర్స్ లో అటాక్ చేస్తే చేసిన కష్టమంతా ఉఫ్ అని ఊదేసినట్లు అవుతుంది అని ఆలోచిస్తున్నారుట.

దాంతో ఈ టైటిల్ ని అలగే ఉంచి జనంలోకి వెళ్ళడమా అన్న దాంట్లో ఇంకా డైలామాలో ఉన్నారని అంటున్నారు. అలా కాకుండా టైటిల్ ని మార్చేసి వెళ్ళాలంటే ఇప్పటికే ఆర్భాటంగా దాని మీద ప్రచారం అయితే చేసుకున్నారు. దాంతో ఏం చేయాలి అన్న దాని మీద టీడీపీలో మల్లగుల్లాలు పడుతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఖర్మను కాస్తా పక్కన పెట్టి మిగిలిన విషయాల మీద ఆలోచన చేయాలని  నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఇంతకీ డిసెంబర్ 1 నుంచి తమ్ముళ్ళ ఆందోళనలు ఉంటాయా అంటే పార్టీ జనాల నుంచి సరైన జవాబు అయితే లేదు. ఈలోగా ఏమైనా మార్పు చేర్పులు చేసి మొత్తం ప్రోగ్రాం నే వేరేగా మారుస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే కొత్తగా మోజు పడి నియమించుకున్న రాబిన్ శర్మ ఇచ్చిన తొలి  ప్రోగ్రామే టైటిల్ కారణంగా ఇంతలా బూమరాంగ్ కావడం అంటే ఇదేమి ఖర్మరా బాబూ అని టీడీపీలోనే తల పట్టుకునే పరిస్థీతి వస్తోందిట.

అయినా అన్నారంటే అన్నారని బాధపడతారు కానీ. ఎక్కడో గుజరాత్ కి చెందిన రాబిన్ శర్మకు ఏపీ రాజకీయాలు బాబు కంటే బాగా అర్ధమవుతాయా అని తమ్ముళ్ళే అంటున్నారు. ఇలాంటివి వందల వేల ప్రోగ్రామ్స్  నడిపించిన బాబు బుర్రకు పదును పెడితే దీనికి  బాబు లాంటి ప్రోగ్రాం అదిరిపోయే టైటిల్ తో జనంలోకి దూసుకుపోవచ్చు అని వారు అంటున్నారుట. అయినా ఇదేం ఖర్మరా బాబూ అన్నదే ఇపుడు అటూ అటూ మాటల తూటాలతో  వైసీపీ టీడీపీ విమర్శలకు చేసుకునేలా ఏపీ రాజకీయం ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News