తూర్పున పసుపు రెపరెపలు

Update: 2022-11-03 00:30 GMT
మార్పుకు ఎపుడూ తూర్పే సాక్ష్యం. సూర్యుడు తెల్లారుతూనే వచ్చి చీకట్లను తొలగిస్తాడు. అలాగే సమస్యల చిక్కులను తొలగించాలన్నా కొత్త తీర్పు వైపు జనాలను కదిలించాలన్నా తూర్పే కీలకం. ఏపీలో తూర్పు గోదావరి జిల్లాకు అంతటి ప్రాముఖ్యత ఉంది. విభజన ఏపీలో రెండు సార్లూ తూర్పు అలా ప్రభుత్వాలు మారడంలో తనదైన రాజకీయ చాతుర్యం ప్రదర్శించింది. ఈసారి కూడా ఎన్నికలు ఏడాదిన్నర ఉందనగానే తూర్పులో మార్పు బాగా కనిపిస్తోంది అని అంటున్నారు.

అధికార వైసీపీ వైభవం గతంలోకి మెల్లగా జారుకుంటోంది అన్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే టైం లో గత ఎన్నికల్లో చావు దెబ్బ తిని చిరునామా గల్లంతు అయిన ప్రతిపక్ష తెలుగుదేశం ఈసారి రాచ ఠీవిని ప్రదర్శిస్తోంది. టీడీపీ మూడున్నరేళ్ల కాలంలో బాగా పుంజుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. నాడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న నేతలు అంతా ఇపుడు ఒక్కటి అవుతున్నారు.  వారిలో పట్టుదల కూడా అలాగే పెరుగుతోంది.

దాంతో పాటు ఈసారి కచ్చితంగా వచ్చేది తమ ప్రభుత్వమే అన్న దృఢ విశ్వాసం కూడా కనిపిస్తోంది. ఇక 2019 ఎన్నికల ఫలితాను తీసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పదహారు ఎమ్మెల్యే సీట్లకు గానూ టీడీపీ నాలుగంటే నాలుగు గెలుచుకుంది. మిగిలిన పన్నెండూ కూడా వైసీపీ ఖాతాలో పడిపోయాయి. అంతే కాదు కాకినాడ, రాజమండ్రీ రెండు ఎంపీ సీట్లను కూడా వైసీపీ విజయకేతనం ఎగరవేసింది.  అలా ఫ్యాన్ గిర్రున నాడు తిరిగేసింది.

అలాంటి తూర్పులో ఇపుడు చాలా మార్పు వస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వర్గ పోర్తు ఫ్యాన్ ని అసలు తిరగనీయకుండా చేస్తోంది అని అంటున్నారు. నేతలు అంతా ఎవరికి వారుగానే ఉంటున్నారు. ఆధిపత్య పోరుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి జగన్ వారిని ఎన్ని సార్లు చెప్పినా ఎంతలా వారించినా కూడా వారు ఎక్కడా తగ్గడంలేదు. దాంతో వైసీపీ స్వయంకృతానికి ఇది దారితీసేలా ఉంది అంటున్నారు.

మరో వైపు మూడు రాజదానుల వ్యవహారం చూస్తే వైసీపీకి ఈ జిల్లాలో బూమరాంగ్ అయ్యేలా ఉంది అంటున్నారు. ఈ జిల్లా వారంతంతా వ్యాపారాలు, వ్యవహారాలూ అన్నీ కూడా విజయవాడ కేంద్రంగానే నిర్వహిస్తారు. దాంతో వారికి అక్కడ దగ్గరలో అమరావతి కేంద్రంగా రాజధాని ఉండడమే ఇష్టమని అంటున్నారు. అలా కాకుండా వైసీపీ తీసుకొచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్ వారికి ఆగ్రహం కలిగిస్తోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ దూకుడుతనం ఆయనతో ఎమ్మెల్యేలు పెట్టుకుంటున్న పేచీలు ఇవన్నీ కూడా జనాలకు తీవ్రనగానే చికాకు తెప్పిస్తున్నాయి అని అంటున్నారు. ఇలా సొంత పార్టీ నేతల వ్యవహార శైలి వల్ల వైసీపీకి వ్యతిరేక గాలి అంతటా వీస్తోంది అని అంటున్నారు. ఇక కాకినాడలో చూస్తే అర్గన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి కచ్చితనా ఓడిపోతారు అని ఏకంగా అధినాయకత్వానికి సర్వే నివేదికలు ఉన్నాయట.

అదే టైం లో ఇపుడు కాకినాడ రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిన్నటి మంత్రి కురసాల కన్నబాబు కూడా ఓటమి పాలు అవుతారు అని అంటున్నారు. రాజమండ్రీ రూరల్ లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి బలంగా ఉన్నారు. అర్బన్ లో ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో టీడీపీ ఇక్కడ పటిష్టంగా ఉంది. ప్రజలతో నేరుగా సంబంధాలను పెట్టుకుని నేతలు జనంలోకి వెళ్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తూ జనాభిమానాన్ని బాగా చూరగొంటున్నారు. ఈ విధంగా చూస్తే టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే అధికార వైసీపీ నేతల అవినీతి, అక్రమాల విషయం కూడా జనాలలో చర్చకు వస్తోంది. ముఖ్యంగ ఆవ భూముల వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారింది అంటున్నారు. ఇసుకను, మట్టిని సైతం నేతలు దిగమింగేస్తున్నారు అంటూ వైసీపీలోనే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ జనాల్లో పలుచన అవుతున్నారు. జనాలకు కూడా చీదర పుట్టిస్తున్నారు.

ఇలా అనేక కారణాలు కలసి టీడీపీ బాగా పుంజుకుంది అని అంటున్నారు. తమ్ముళ్ళు అంతా కలసి రావడం, ఒక్కటిగా నిలిచి ప్రజా పోరాటాలు చేయడంతో టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయి అని అంటున్నారు. ఇవన్నీ కలిస్తే కనుక 2014 నాటి బంపర్ రిజల్ట్స్ ఈ జిల్లాలో రిపీట్ అవుతాయని అంటున్నరు. అలా తెలుగుదేశం జెండా తూర్పు జిల్లాలో రెపరెపలు ఆడడం ఖాయమని అంటున్నారు. మరి రిపేర్లు చేసుకోవడానికి అధికార పార్టీ ఏమి చేస్తుందో చూడాల్సిదే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News