టీడీపీ నేతలు ఎందుకు కనబడలేదు ?

Update: 2021-08-09 05:35 GMT
అమరావతి ఉద్యమం 600 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆందోళనకారులను అణిచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిందంటు టీడీపీ మద్దతు మీడియా పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు, కథనాలు అందించింది. ఇంతవరకు ఓకేనే కానీ ఇక్కడే ఓ సందేహం మొదలైంది. ఆదివారం నాడు న్యాయస్ధానం నుండి దేవస్ధానానికి వెళ్ళాలనుకున్న ఉద్యమకారులను పోలీసులు అణిచివేశారని, లాఠీలతో విరుచుకుపడ్డారని చెప్పటమూ కరెక్టే.

మరి ఇంత గందరగోళం జరుగుతుంటే టీడీపీ నేతలంతా ఏమైనట్లు ? చంద్రబాబునాయుడు మొదలుకుని పార్టీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలామంది నేతలే ఉన్నారు కదా. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకని ఆదివారం ఉద్రక్తతలు చోటు చేసుకున్న గ్రామాల్లో కనబడలేదు ?  టీడీపీ నేతలంతా ఉద్యమ గ్రామాల్లో ఉండుంటే ఆందోళనకారులకు మరింత మద్దతుగా ఉండేదికదా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిందే.

చంద్రబాబు హయాంలో కూడా ఉద్యమాలంటే పోలీసులు ఇలాగే వ్యవహరించారు. కాబట్టి ప్రత్యేకంగా పోలీసులను టార్గెట్ చేయాల్సిన అవసరం టీడీపీకి ఉద్యమకారులకు  లేదు.  ఉద్యమకారులపై పోలీసు లాఠీలు విరిగాయని, ఆందోళనకారులపై పోలీసులు పాశవికంగా విరుచుకుపడ్డారని ఆ తర్వాత చంద్రబాబు, టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది.

అమరావతి ఉద్యమకారులకు మద్దతు ప్రకటించిన టీడీపీ నేతలు అవసరం ఉన్నపుడు మాత్రం ఎందుకని క్షేత్రస్ధాయిలో కనబడలేదు. చంద్రబాబునాయుడ, అచ్చెన్నాయుడు, లోకేష్ అండ్ కో మొత్తం నేతలంతా ట్విట్టర్, ప్రెస్ నోట్లకు మాత్రమే పరిమితమవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఆందోళనకారులను ముందుండి నడిపించటానికి ఒక్కరంటే ఒక్కనేత కూడా క్షేత్రస్ధాయిలో కనబడలేదు. అంటే దెబ్బలన్నీ ఉద్యమకారులకు, ప్రచారం మాత్రం టీడీపీ నేతలకా ?

ఉద్యమాకారులపై పోలీసులు కఠినంగానే వ్యవహరించుండచ్చు. ఆందోళనలను, ధర్నాలన్నాక ఆడ, మగ అన్న తేడాలుండవు పోలీసులకు. ఎవరు దొరికితే వారిని వాయించేయటమే వాళ్ళపని. పైగా ఆందోళనకారులు కూడా ఆంక్షలను ఉల్లఘించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి పోలీసులతో గొడవలయ్యాయి. ఆందోళనకారులు కూడా వ్యూహాత్మకంగా ముందు ఆడవాళ్ళని నిలబెట్టారు. దాంతో దెబ్బలు ముందు ఆడవాళ్ళకే పడ్డాయి. ఉద్యమకారులను వాళ్ళ ఖర్మకు వాళ్ళని వదిలేయకుండా టీడీపీ నేతలు ముందు ఉండుంటే ప్రభుత్వ దమనకాండను మరింతగా ఎండగట్టి ఉండచ్చు.
Tags:    

Similar News