టీడీపీకి ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?

Update: 2021-08-31 23:30 GMT
తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి జ్ఞానోదయం అయ్యినట్లుంది. వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి జనంలో చైతన్యం తేవాలని డిసైడ్ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధి విషయంలో ప్రధానంగా సాగు, తాగునీటి పథకాల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నేతలు నిర్ణయించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పరిశీలనకు తొందరలోనే బస్సు యాత్ర చేయాలని డిసైడ్ చేశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రభుత్వం తీరు తదితర విషయాలపై చర్చించేందుకు సోమవారం మూడు జిల్లాల్లో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. సరే సమావేశంలో నేతలు చేసిన తీర్మానాల్లో చాలావరకు ఉత్త సొల్లన్న విషయం తెలుస్తూనే ఉంది. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి రెండున్నరేళ్ల గడువిచ్చినా ఉపయోగం కనబడలేదని నేతలు చెప్పటమే విచిత్రం.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తీసుకున్న చాలా నిర్ణయాలపై ఎవరో ఒకరు కోర్టుల్లో కేసులు వేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రెండున్నరేళ్ల పాలనలో ఏడాదిన్నర పైగా కరోనా వైరస్ తీవ్రతే సరిపోయింది. టీడీపీ హయాంలో తారకరామా, జంఝావతి, వంశధార, నాగావళి, పెద్ద గడ్డ లాంటి ఎన్నో పథకాలు అభివృద్ధి చేసినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. నిజానికి వీటిల్లో చాలావరకు కాంగ్రెస్ హయాంలోనే పనులైపోయాయి. టీడీపీ వచ్చిన తర్వాత చేసింది తక్కువనే చెప్పాలి. టీడీపీ చేసిందేమంటే కొన్ని ప్రాజెక్టులకు టెంబర్లు పిలవటమే. టెండర్లు పిలవటం కూడా అచ్చెన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే అని చెప్పేసుకున్నారు.

అనేక కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డిని జగన్ ఉత్తరాంధ్రకు ఎందుకు పంపారని అచ్చెన్న అడగటంలో అర్ధమేలేదు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు ఇన్చార్జిగా ఉన్నారు. ఈ విషయం అచ్చెన్న మరచిపోయినా జనాలందరికీ గుర్తుంది. తర్వాత అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ సింహాచలం భూముల్లో 800 ఎకరాలు మాయమయ్యాట అంటూ ఎద్దేవా చేశారు. సర్వే నెంబర్లు చెప్పమంటే చెప్పడం లేదని చెప్పడం విడ్డూరం.

800 ఎకరాలకు సంబంధించి ఏ గ్రామంలో ఎంత భూమి కబ్జా అయ్యిందనే విషయాన్ని గతంలోనే సర్వే నెంబర్ తో సహా చెప్పిన విషయాన్ని అశోక్ మరచినట్లున్నారు. సరే ప్రతిపక్ష మన్నాక టీడీపీ ఇలానే మాట్లాడుతుందనటంలో సందేహం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికైనా ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించడం. సమస్యలపై మీడియాలో లేకపోతే జూమ్ ద్వారానో అదీకాక పోతే కోర్టుల్లో కేసులు వేయటమే కాకుండా జనాల్లోకి వెళ్ళాలని డిసైడ్ చేయడం మంచిది. ఎవరేమిటో జనాలే తేలుస్తారప్పుడు.




Tags:    

Similar News