జలయుద్ధం: కేసీఆర్, జగన్ ఫైట్ పై టీడీపీ అనుమానాలు

Update: 2021-07-01 14:30 GMT
ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం ముదురుతోంది. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని తెలంగాణ డిమాండ్ చేయడం... దానికి అనుమతులు ఉన్నాయని.. మా వాటా కోసం నిర్మిస్తున్నామని ఏపీ అనడం.. ఇరు రాష్ట్రాల మంత్రుల మాటల తూటాలతో వార్ ముదిరి పాకాన పడింది..

తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లోని నీటిని అంతటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వృథాగా వదిలేస్తుండడంతో ఏపీ భగ్గుమంది. ఇక  ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రాజెక్టులపై మోహరించేదాకా పరిస్థితులు వెళ్లాయి. తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులపై భారీగా పోలీసులను మోహరించింది. ఏపీ అధికారులను అనుమతించలేదు. దీంతో   ప్రాజెక్టుల సాక్షిగా రెండు రాష్ట్రాల మధ్య జలయుద్ధం పతాకస్థాయికి చేరింది.

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదంపై తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, జగన్ లు డ్రామాలు ఆడుతున్నారని..కావాలనే ఆడుతున్న పెద్ద నాటకం అని విమర్శించారు.    ఇదంతా ఇద్దరు సీఎంలు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. తాజాగా టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర కామెంట్లు చేశాడు. జగన్ తోపాటు కేసీఆర్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడుదొంగలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పుడు జలవివాదాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కేశినేని మండిపడ్డారు. అసలు జలవివాదమే ఒక పెద్ద డ్రామా అని కేశినేని విమర్శించారు. కేసీఆర్, జగన్ మధ్య పరస్పర సహకారం ఉందన్నారు.

హైదరాబాద్లో ఉన్న జగన్ ఆస్తులు కాపాడుకోవడం కోసమే మౌనండా ఉన్నారని కేశినేని నాని ఆరోపించారు. ప్రజలను పిచ్చోళ్లను చేసి ఇద్దరు సీఎంలు ఆడుకుంటున్నారని.. ప్రజలు ఈ డ్రామాలను గమనించలేనంత పిచ్చోళ్లు కాదని వ్యాఖ్యానించారు.

ఇక ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సైతం జలవివాదంపై స్పందించారు. ఏకపక్షంగా తెలంగాణ నీరు విడుదల చేసుకుంటుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. ఈ మౌనానికి కారణం పక్క రాష్ట్రంలో ఉన్న మీ ఆస్తులను కాపాడుకోవటమేనా? అంటూ జగన్ ను నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ లో తీర్మానమైన కేఆర్ఎంబీ నియంత్రణ పరిధిని ఎందుకు నోటిఫై చేయడం లేదు అని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి, నీటి విడుదల ఏకపక్షంగా జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  హైదరాబాద్ లో గతంలోనూ తెలుగు వారు ఉన్నారని.. కనుక తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ప్రశ్నించలేకపోతున్నామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణలో తెలుగు వారు ఉన్నారని.. ప్రగతి భవన్ లో భోజనం చేసినప్పుడు కూడా తెలుగువారు ఉన్నారని ఎద్దేవా చేశారు.

మొత్తం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవివాదం రాజుకున్నది కాదని.. రాజేసిందని.. ఇందులో సీఎంలు కేసీఆర్, జగన్ లు ఇద్దరూ భాగస్వాములని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News