చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వచ్చిన టీడీపీ మహిళా నేత

Update: 2022-05-03 05:17 GMT
సొంత పార్టీకి చెందిన నేత.. తనను నమ్మినందుకు ముప్ప తిప్పలు పెడుతున్నారు. అవసరమంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తికి తిరిగి డబ్బులు చెల్లించకపోగా.. ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిన కేసు విచారణ కోసం  విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. గతంలో ఆమె ఇచ్చిన చెక్కు బౌన్స్ కావటంతో కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైనట్లుగా చెబుతున్నారు.

2015లో టీడీపీ నేత వేగి శ్రీనివాసరావు.. వంగలపూడి అనితకు రూ.70 లక్షలు అప్పుగా ఇచ్చారు. అవసరం కోసం తీసుకున్న డబ్బుకు సంబంధించి అనిత 2018లో ఒక చెక్కు ఇచ్చారు. దాన్ని బ్యాంకులో వేయగా.. అది కాస్తా బౌన్స్ అయ్యింది. దీంతో.. 2019లో శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశారు.

ఈ కేసు విచారణ తాజాగా విశాఖ జిల్లా కోర్టులో జరిగింది. ఈ నేపథ్యంలో అనిత విశాఖ కోర్టుకు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోర్టుకు వచ్చిన నేపథ్యంలో.. ఆమెపై కేసు వేసిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అవసరం కోసం తాను డబ్బులు ఇస్తే.. ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదన్నారు. ఎప్పుడూ ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునే వారని పేర్కొన్నారు.

సొంత పార్టీకి చెందిన నేతనే మోసం చేయటం ఏమిటని శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న అనిత ఇలా చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే.. తన కేసును తాను విత్ డ్రా చేసుకుంటానని చెబుతున్నారు.

అయితే.. ఈ ఉదంతంపై అనిత మాట్లాడలేదు. తన వాదనను వినిపించలేదు. పార్టీ నేత శ్రీనివాస్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News