కాంతార గెటప్ లో ఆకట్టుకున్న తహసీల్దార్..!

Update: 2022-11-14 17:30 GMT
కన్నడలో తెరకెక్కిన కాంతార మూవీ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దర్శకుడు హీరోగా మారితే ఎలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనడానికి కాంతారా మూవీనే ఒక పెద్దగా ఉదాహరణగా నిలుస్తోంది. రిషబ్ శెట్టి అద్భుత నటనపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు..  విమర్శకులు అతడిపై ప్రశంసలు కురిపించారు.

తెలుగులో కాంతార మూవీని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో సమర్పించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ కలెక్షన్లు రాబట్టి అల్లు అరవింద్ కు మంచి లాభాలను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. కాంతార మూవీ తెలుగు ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయిందనడానికి ఈ ఒక్క సంఘటనే నిదర్శనంగా మిగిలింది.

విజయనగరం తహసీల్దార్ గా ప్రసాదరావు విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు వృత్తిపై ఎంత గౌరవమో.. అలాగే కళలపై కూడా అంతే ఆరాధన కూడా ఉందని పలుసార్లు గతంలో నిరూపించారు. తాజాగా కాంతార గెటప్ లో కన్పించి తహసీల్దార్  అందరినీ మెస్మరైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాజాగా గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఆరవ ఎడిషన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం తహసీల్దార్ ప్రసాదరావు నటనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కాంతార గెటప్ లో డాన్స్ షో చేసి సభికులను అబ్బురపరిచారు. కాంతార గెటప్ లో ప్రసాదరావు ఏకపాత్రాభినయం చేసి ప్రజల మన్నలను చూరగొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సైతం ప్రసాదరావును అభినందించడంతో పాటు సెల్ఫీ దిగారు. దీంతో ప్రసాదరావుపై తోటి ఉద్యోగులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రసాదరావు కాంతార గెటప్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News