సోమవారానికి సభను వాయిదా వేసేశారు

Update: 2015-10-01 06:49 GMT
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అనూహ్యంగా వాయిదా పడిపోయింది. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే.. సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకోవటంతో విస్తుపోవటం విపక్షాల వంతైంది.

సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైనా.. విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అంగన్ వాడీ సమస్యలపై సంబంధిత మంత్రిని పలు ప్రశ్నలు సంధించారు. వీటికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా స్పీకర్ మధుసూదనాచారి సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభను సోమవారానికి వాయిదా వేయటంతో కంగుతిన్న విపక్షాలు.. వాయిదా పడిన తర్వాత కూడా సభ నుంచి బయటకు వెళ్లకుండా ఉండిపోయారు.  అధికారపక్షంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అధికారపక్షం తీరుపై అసెంబ్లీ ఎదుట ఉన్న పబ్లిక్ గార్డెన్ లో విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఎంటర్ అయిన పోలీసులు.. ఎమ్మెల్యేల్నీ నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేయటంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
Tags:    

Similar News