టీ బీజేపీలో ఆ రెండు వ‌ర్గాల ఫైటింగ్‌

Update: 2016-07-30 05:55 GMT
తెలంగాణ బీజేపీలో మూడు ముక్క‌లాట‌-ఆరు స్తంబాలాట మంచి జోరుగా సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న ద్వారా ఏర్ప‌డి రెండు చిన్న‌రాష్ట్రాల్లోనూ ల‌బ్ధి పొందాల‌ని ముందుగానే  స్కెచ్ గీసిన బీజేపీ.. ఆ మేర‌కు రాష్ట్రం విడిపోవ‌డానికి త‌న వంతు గొంతు క‌లిపింది. అయితే, అనుకున్న‌ది సాధించాక ఇప్పుడు మాత్రం తెలంగాణ బీజేపీ నేత‌లు కుమ్ములాట‌ల‌తో టైం పాస్ చేస్తున్నారు. దీంతో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని, ఎప్పుడో ఒక‌ప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రాక‌పోతుందా? అని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న దిగువ‌స్థాయి నేత‌లు.. అసలు పార్టీని ముందుండి న‌డిపించే ఉన్న‌త‌స్థాయి నేత‌లే కీచులాడుకుంటుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌క కుమిలిపోతున్నారు. కేంద్రంలోనూ తామే అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో క‌మ‌ల ద‌ళాన్ని పెంచి పోషించుకోవ‌డం తేలికైన విష‌య‌మ‌ని, అయితే, రాష్ట్ర పార్టీ పెద్ద‌లు మాత్రం త‌మ త‌మ ఆధిప‌త్యం కోసం పార్టీని బ‌లిచేసేలా ఉన్నార‌ని దిగువ శ్రేణి నాయ‌క‌త్వం చ‌ర్చించుకుంటోంది.

అస‌లింత‌కీ తెలంగాణ బీజేపీలో ఏం జ‌రుగుతోందో చూద్దాం.. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో ఇద్ద‌రు నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కేంద్ర మంత్రిగా బండారు ద‌త్తాత్రేయ‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా మురళీధర్‌రావు ఉన్నారు. ఇప్పుడు వీరిచుట్టూతానే తెలంగాణ బీజేపీ రాజ‌కీయం న‌డుస్తోంద‌ట‌. క‌మ‌ల సార‌థి అమిత్ షా స‌హా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ద‌గ్గ‌ర పూర్తిస్థాయ‌లో ప‌లుకుబ‌డి క‌లిగి ఉండడం వీరికి ప్ల‌స్ పాయింట్‌. ఈ క్ర‌మంలో రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష‌ణ్ స‌హా మాజీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డిలు ఈ ఇద్ద‌రు నేత‌లనే ఆధారంగా చేసుకుని రాజ‌కీయాలు చ‌క్క‌చెబుతున్నారు.

   అయితే, అంతా స‌జావుగా సాగితే.. చెప్పేదేముంది. ఇక్క‌డే తెలంగాణ క‌మ‌ల ద‌ళం రెండుగా చీలిపోయింద‌ట‌. ఒకవైపు దత్తాత్రేయ మనుషులు... ఇంకోవైపు మురళీధర్‌రావు అనుయాయులు... తమకు అనుకూలంగా ఉన్న క్యాడర్‌ను చేరదీసి వర్గాలను నడిపిస్తున్నారట.  తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం.. ముర‌ళీధ‌ర్‌రావు క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తుంటే.. కిష‌న్‌రెడ్డి వర్గం.. ద‌త్తాత్రేయ‌తో ట‌చ్‌లో ఉంటున్నార‌ట‌. అయితే, ఈ రెండు వ‌ర్గాల్లోనూ ల‌క్ష్మ‌ణ్ ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం.. కిష‌న్‌కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు. ముఖ్యంగా  బీజేపీ కోర్‌కమిటీ సమావేశాన్ని ల‌క్ష్మ‌ణ్ ఏకంగా మురళీధ‌ర్‌రావు నివాసంలో ఏర్పాటు చేయ‌డంపై ల‌క్ష్మ‌ణ్ వ‌ర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. కేవ‌లం త‌న ఆధిప‌త్యం నిరూపించుకోవ‌డం కోస‌మే ముర‌ళీధ‌ర్‌రావు ఇలా చేస్తున్నార‌ని, రాష్ట్ర బీజేపీ రాజ‌కీయాల్లో వేలు పెడుతున్నార‌ని త‌మ అనుచ‌రుల ద‌గ్గ‌ర బాహాటంగానే విమ‌ర్శిస్తున్నార‌ట‌.

   ఈ క్ర‌మంలో త‌మ ఆధిప‌త్యం నిరూపించుకునేందుకు ద‌త్తాత్రేయ‌, కిష‌న్‌రెడ్డిలు కూడా ఏదో ఒక కార్య‌క్ర‌మం నిర్వ‌హించేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే, క‌మ‌ల ద‌ళంలో జ‌రుగుతున్న ఈ ప‌రిణామాలను అధికార టీఆర్ ఎస్, సీఎం కేసీఆర్ త‌న‌కు అనుకూలంగా మ‌లుకునే అవ‌కాశం ఉంద‌ని, ఇప్ప‌టికిప్పుడు బీజేపీ నేత‌లు జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ప‌రిశీల‌కులు హెచ్చ‌రిస్తున్నారు.  ఐకమత్యంగా పార్టీని నడిపించాల్సిన పెద్దలు ఇలా గ్రూపు రాజకీయాలకి పరిమితం కావడంపైనా వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ముందుడి న‌డిపించాల‌ని, తెలంగాణ నేత‌లు మేల్కోవాల‌ని వారు సూచిస్తున్నారు. మ‌రి.. ఈ మాట‌లు బీజేపీ నేత‌ల‌కు చెవికెక్కుతాయో లేదో చూడాలి.
Tags:    

Similar News