ప్రగతిభవన్ లో రివ్యూ పెట్టిన కేసీఆర్ అనవసరంగా రిస్కు తీసుకున్నారా?

Update: 2020-06-15 05:50 GMT
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ప్రగతిభవన్ కాస్త సందడిగా మారింది. ఆ మధ్యన టెన్త్ క్లాస్ పరీక్షల పైన నిర్ణయం తీసుకునేందుకు ఫాంహౌస్ నుంచి ప్రగతిభవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్.. రివ్యూ సమావేశమయ్యాక మళ్లీ తిరిగి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం ఆయన వైద్య ఆరోగ్య శాఖాధికారులతో పాటు.. ప్రభుత్వంలోని కీలకంగా వ్యవహరించే వారితో కలిసి రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు.

ఇటీవల కాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు కావటం.. నమోదయ్యే కేసుల్లో అత్యధికం హైదరాబాద్ లోనే కావటంతో.. ఏం చేయాలన్నది పాలుపోని పరిస్థితి. ఇది సరిపోదన్నట్లుగా అధికార వర్గాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కొత్త కలకలం రేపింది. సాయంత్రం మొదలైన ఈ రివ్యూ మీటింగ్ జరుగుతుండగానే మీడియా వర్గాలకు ఒక సమాచారం అందింది. ఇది కాస్తా సంచలనంగా మారింది.

వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ కు ఓఎస్డీగా వ్యవహరించే గంగాధర్ కు ఇటీవల నిర్వహించిన నిర్దారణ పరీక్ష ఫలితం ఆదివారం సాయంత్రం వచ్చింది. అదికాస్తా పాజిటివ్ కావటంతో ఒక్కసారంతా ఉలిక్కిపడిన పరిస్థితి.  ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న అంచనా లేదో ఏమో కానీ..సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ కు ఈటెల కూడా హాజరయ్యారు.

మంత్రి ఓఎస్డీకి పాజిటివ్ అయినప్పుడు.. మంత్రి ఈటెలకు ముప్పు అవకాశాలు ఎక్కువన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో.. సీఎం రివ్యూ మీటింగ్ లో కేసీఆర్ కు దగ్గరగా మంత్రి ఈటెల ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు ముఖ్యమంత్రి సైతం క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రివ్యూ సమావేశానికి ముందు.. ఈటెల ఓఎస్డీ ఫలితం మీద ముఖ్యమంత్రికి సమాచారం లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేసుల తీవ్రత పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి నిర్వహించిన రివ్యూ మీటింగ్ రిస్కుతో కూడుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఇలాంటి రిస్కులకు కాస్త దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News