ఇండియాలో హైద‌రాబాదు ఎందుకు బెస్ట్ అంటే..

Update: 2017-11-29 05:59 GMT
ఎంత‌సేపు మాట్లాడామ‌న్న‌ది ముఖ్యం కాదు.. ఎంత బాగా మాట్లాడామ‌న్న‌ది ముఖ్యం. ఆ విష‌యాన్నే న‌మ్ముకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న మాట‌ల‌తో అద‌ర‌గొట్టేశారు. కేవ‌లం మూడు నిమిషాలు మాత్ర‌మే మాట్లాడిన ఆయ‌న‌.. త‌న‌కున్న స‌మ‌యంలో తానేం చెప్పాలో.. బ్రాండ్ హైద‌రాబాద్‌ను త‌న మాట‌ల‌తో ఎంత ప్రొజెక్ట్ చేయాలో అంతగా ఫోక‌స్ చేశార‌ని చెప్పాలి. తమ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న టీఎస్ - ఐపాస్ విధానానికి సంబంధించి హైలెట్ అయిన 15 రోజుల్లోనే ప‌రిశ్ర‌మల‌కు అనుమ‌తుల‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

ఒక‌వేళ 15 రోజుల్లో అనుమ‌తులు రాని పక్షంలో.. అనుమ‌తులు వ‌చ్చిన‌ట్లుగా భావించొచ్చ‌ని.. ఆ త‌ర‌హా విధానాన్ని తాము తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా చెప్పారు. జీఈఎస్ స‌ద‌స్సుకు హైద‌రాబాద్ వేదిక కావ‌టంపై సంతోషాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని.. టీఎస్ - ఐపాస్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ 5469 యూనిట్ల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు. వీటి కార‌ణంగా ఐదు ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ తెలంగాణ రాష్ట్రానికి మొద‌టి స్థానం ద‌క్కింద‌న్న ఆయ‌న‌.. పారిశ్రామికంగా తెలంగాణ పుంజుకుంటోంద‌ని.. టీహ‌బ్ ద్వారా ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లుగా చెప్పారు. భార‌త‌దేశంలో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ఎందుకు బెస్ట్ అన్న విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పిన కేసీఆర్‌. అమెరికాలో అతి ముఖ్య‌మైన  అయిదు కంపెనీలు.. యాపిల్‌.. గూగుల్‌.. మైక్రోసాఫ్ట్‌.. ఫేస్ బుక్‌.. అమెజాన్ లు అమెరికా వెలుప‌ల త‌మ రెండో కేంద్ర కార్యాల‌యాల్ని హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోనే నెల‌కొల్పార‌ని చెప్ప‌టానికి తాను సంతోషిస్తున్న‌ట్లుగా చెప్పారు.

స్వ‌దేశీ.. విదేశీ పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంద‌న్న ఆయ‌న‌.. యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను త‌మ ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌న్నారు. ప్ర‌పంచంలో కొత్త‌గా వ‌స్తున్న ఆవిష్క‌ర‌ణ‌ల నుంచి అనుభ‌వాల‌ను నేర్చుకోవ‌టానికి తాము ఆస‌క్తిగా ఉన్న‌ట్లు చెప్పిన కేసీఆర్‌.. జీఈఎస్ స‌ద‌స్సులో జ‌రిగే చ‌ర్చ‌లు.. ఆలోచ‌న‌లు.. ప్ర‌ణాళిక‌లు విజ‌య‌వంతం అవుతాయ‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News