తెలంగాణకు రండి..మిషన్ భగీరథకు మాత్రం వద్దు

Update: 2016-08-05 05:05 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ప్రధానిగా బాధ్యతలుచేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఒక బహిరంగ లేఖను రాయటం ఆసక్తికరంగా మారింది. మోడీ తెలంగాణకు రావటాన్నితాము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని.. కాకుంటే మిషన్ భగీరథ మినహా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ తెలంగాణ కాంగ్రెస్ కోరింది.

ఆ పార్టీ తెలంగాణ చీఫ్ తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖలో మోడీకి ఈ విన్నపాన్ని చేశారు. ప్రధాని స్థాయి నేత మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించటం తగదని.. అనేక అవకతవకలతో రూపొందించిన ఈ ప్రాజెక్టు పేరును సైతం మార్చేశారని.. ఈ పథకం ప్రధాన ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి భగీరథ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని.. అందుకే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ భాగస్వామ్యులు కాకూడదని పేర్కొన్నారు.

హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో భారత రత్న మౌలానా అబ్దుల్ కలాం అజాద్ సుజల స్రవంతి పేరుతో ప్రాజెక్టును చేపట్టిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఎల్లంపల్లి జలాశయం నుంచి మొదటి దశలో 10 టీఎంసీల నీటిని తరలించేందుకు రూ.3350 కోట్లతో పనులు ప్రారంభించిందన్నారు. ఆ నిర్మాణం కాంగ్రెస్ హయాంలోనే పూర్తి అయినా..  దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు.. మంత్రి కేటీఆర్ లు మిషన్ భగీరథ పేరు మార్చి ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారే చేపట్టినట్లుగా ప్రచారం చేస్తున్నట్లుగా ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలతో నడిచే పథకాన్ని ప్రధాని ప్రారంభించకూడదంటూ వారు కోరుతున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బహిరంగ లేఖ లక్ష్యం ప్రధాని మోడీ వరకూ చేరుతుందా? అన్నది ఒక ప్రశ్న. నిజంగానే.. అంత పెద్ద తప్పే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే..ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకొని.. ఆయనకే సదరు లేఖను వినపతిపత్రం రూపంలో అందించి వస్తే బాగుండేది కదా? ఆ పని చేయకుండా.. పర్యటనకు రెండు రోజుల ముందు ఈ లొల్లేందో..?
Tags:    

Similar News