ఆదివారం ఖర్చు...వంద కోట్లకు పైనే !

Update: 2018-11-26 05:15 GMT
ఆదివారం. అదీ ఎన్నికల ముందు వచ్చిన ఆదివారం. అది కూడా కార్తీకమాసంలో వచ్చిన ఆదివారం. ఇంకేముంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరైన సమయం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఇక పది రోజులే మిగిలి ఉండడంతో అన్ని పార్టీ అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కార్తీక వన భోజనాల పేరుతో వివిధ కాలనీల్లోని వారు - వివిధ కుల - మత సంఘాల వారు ఏర్పాటు చేసుకున్న కార్తీక వనభోజనాల వేదికలన్నీ ప్రచార వేదికలుగా మారాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలు - వరంగల్ జిల్లాలోని వేయి స్థంభాల గుడి - ఖమ్మంలో పెద్ద చెరువు - నగర శివారులోని కీసరగుట్ట - పటాన్ చెరు - కొంపల్లి శివారుతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో వనభోజనాలు జరుగుతున్న ప్రాంతాల వద్ద వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు వాలిపోయారు. మరికొందరు అభ్యర్ధులైతే తామే కొన్ని కాలనీలు - కుల సంఘాల వారికి - కొన్ని అపార్ట్‌ మెంట్ల వారికి వన భోజనాల ఏర్పాట్లు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఒక్క ఆదివారం... అంటే 25 వ తేదీనే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు వన భోజనాల కోసం దాదాపు వంద కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులందరూ పోటీలో ఉన్నారు. ఎన్నికలకు ఇక పది రోజులే గడవు ఉంది. అలాగే కార్తీక మాసం కూడా పది రోజలే ఉంది. ఇందులో వన భోజనాలు నిర్వహించేందుకు మిగిలింది కూడా ఒక్క ఆదివారమే. దీంతో 25 వ తేదీన వచ్చిన ఆదివారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వారే ఎవరో ఒకరి పేరిట వనభోజనాలు ఏర్పాటు చేసి అక్కడికి అందరినీ రప్పించేలా చర్యలు తీసుకున్నారంటున్నారు. ఈ వన భోజనాలకు తెలంగాణ వ్యాప్తంగా ఒక్క ఆదివారం నాడే వంద కోట్ల రూపాయలు వరకూ ఖర్చు అయినట్లు చెబుతున్నారు. కార్తీక మాసంలో మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉంటారు. అయితే మందు బాబులు మాత్రం ఎక్కువగా ఉన్నారని, వారి కోసం మాత్రమే మాంసాహారాన్ని వడ్డించారని చెబుతున్నారు. ఒక్క ఆదివారం నాడే తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎన్నడూ లేనంత ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్ధులు తమకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారని అంటున్నారు.


Tags:    

Similar News