బీజేపీలో చేరిన డీఎస్ త‌న‌యుడు..ప‌ద‌వే ఆల‌స్యం

Update: 2017-09-17 16:45 GMT
కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ నాథ్ సింగ్‌ సమక్షంలో టీఆర్‌ ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్‌ తనయుడు అరవింద్‌ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పారిశ్రామికవేత్త సదానందరెడ్డి - కాంగ్రెస్‌ నేత లక్ష్మీ నర్సింహయ్య కూడా కాషాయ‌కండువా క‌ప్పుకొన్నారు. ఇందుకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన తెలంగాణ విమోచన దివస్‌ సంకల్ప సభ వేదికైంది. కాగా - ఇప్ప‌టికే అర‌వింద్ బీజేపీ చేరిన త‌ర్వాత‌ తనకు ఇచ్చే ప్రాధాన్య అంశాలపై చర్చించినట్లు సమాచారం. తన తండ్రి తెలంగాణలో అధికార టీఆర్‌ ఎస్ లో ఉన్నప్పటికీ తన మనస్సు చెప్పినట్లు తాను నడుచుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని అరవింద్ త‌న స‌హ‌చ‌రుల‌తో అన్న‌ట్టు స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా కేంద్ర‌ హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ మాట్లాడుతూ నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌ కృషి వల్లే భారత్‌లో తెలంగాణ ప్రాంతం విలీనమయ్యిందని తెలిపారు. సెప్టెంబర్‌ 17 ప్రాముఖ్యత గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందేనని - తెలంగాణకు సంబంధించి సెప్టెంబర్‌ 17 ముమ్మాటికి విమోచన దినోత్సవమన్నారు. దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే ప్రధాని మోడీ లక్ష్యమని అన్నారు. అలాగే పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి మోడీ సర్కార్‌ కృషి చేస్తోందని రాజ్‌ నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకుల పాలనలో దేశంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. నాడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన నాటి కాంగ్రెస్‌ మంత్రులు నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దేశంలో అవినీతిని అరికట్టేందుకు త్వరలో బినామీ నిరోధ చట్టం తీసుకు వచ్చి బినామీలా ఆటకట్టిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్‌ ప్రపంచంలోనే బలమైన దేశంగా రూపుదిద్దుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అన్నారు.

తెలంగాణ విమోచన దివస్‌ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..నిజామాబాద్‌ ప్రజలకు నా వందనాలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ విమోచన పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు.
Tags:    

Similar News