గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ..కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని వినతి

Update: 2020-06-16 09:10 GMT
వైరస్ వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవడానికి వైరస్ కారణంగా మరణించిన వారికీ పరీక్షలు నిర్వహించాలని పలువురు నిపుణులు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ‌కు సూచించారు. సోమవారం రాజ్ ‌భవన్‌ నుంచి గవర్నర్‌ తమిళిసై వైరస్ పై పోరులో అనుసరించాల్సిన వ్యూహంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ రంగాల నిపుణులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిపునులు స్థానిక పరిస్థితుల ఆధారంగా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉండకుండా రాష్ట్రంలో హేతుబద్ధమైన  వైరస్ నిర్ధారణ పరీక్షల విధానం రూపొందించాలని సూచించారు.

ఈ క్రమంలో చాలామంది నిపుణులు ఈ వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని  అభిప్రాయపడ్డారు. వైరస్ చికిత్సకు అయ్యే ఖర్చునంతా బీమా సంస్థలు చెల్లించేలా చర్యలు తీసుకుంటూ ప్యాకేజీ రేట్లను కూడా పెంచాలని కోరారు. రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సహా అన్ని రకాల పరీక్షలనూ వాయిదా వేయాలని, పరీక్షల కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమైనవని ఇందులో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా చికిత్స కోసం ఆన్‌ లైన్ ‌లో వైద్యులతో సంప్రదింపులు జరిపే వీలు కల్పించాలని, టెలిమెడిసిన్‌ సౌకర్యాన్ని మెరుగు పరచాలని తెలిపారు.

ప్రజా ప్రతినిధులు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తక్కువ మంది అనుచరులతో వెళ్లాల్సిందిగా,   జాగ్రత్తలను పాటించాల్సిందిగా సూచించాలన్నారు.  వైరస్ చికిత్సలో భాగంగా ఆయుర్వేదం, సిద్ధ వైద్యవిధానాల్లోని రోగ నిరోధక శక్తిని ఔషధాలను వాడటానికి వీలు కల్పించాలని సూచించారు. విధిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ధ్యానంతో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని.. కాబట్టి, ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి ఆధారంగా టెస్టింగ్‌ చేపట్టాలని, కాంటాక్టులను సమర్థంగా గుర్తించాలన్నారు. వైరస్ పై పోరులో ప్రైవేట్‌ ఆస్పత్రులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. పరీక్ష, చికిత్సల చార్జీలను నియంత్రించాలని, వైరస్ చికిత్సల నిమిత్తం ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని అభిప్రాయ పడ్డారు.  

వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడి చేసే వారిపై కఠిన మైన చర్యలు తీసుకోవాలని , వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, జర్నలిస్టులు, పోలీసులు, సామాజిక సేవ చేస్తున్న వ్యక్తులు, శానిటరీ కార్మికులు... ఇలా  వైరస్ పై పోరులో ముందువరుసలో ఉన్న వారికి నిరంతరం పరీక్షలు చేయాలన్నారు. రెడ్‌ జోన్ ‌లు, హాట్‌ స్పాట్స్ ‌లో ప్రజలకు లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయాలని, హాట్‌ స్పాట్స్ ‌లో పూల్‌ టెస్టింగ్‌ చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు ప్రభుత్వం ఈ సలహాలు, సూచనలు వినియోగించుకునేలా సమగ్ర నివేదికను సమర్పిస్తామని గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Tags:    

Similar News