గెట్ రెడీ : మెట్రో దెబ్బంటే ఇదే

Update: 2017-10-28 06:57 GMT
మరో నెలరోజుల్లో మెట్రో రైలు మొదలుకాబోతున్నదంటే.. హైదరాబాదు నగర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మెట్రో మొదలయ్యాక తమ రోజువారీ ప్రయాణంలో ఎన్ని కొత్త చిక్కులు వచ్చి పడతాయోనని వారు భయపడుతున్నారు. మామూలుగా అయితే.. మెట్రో వస్తున్నదంటే.. సదుపాయాల గురించి అందరూ సంతోషించాలి. కానీ.. హైదరాబాదు మెట్రోకు సంబంధించి కొన్ని సదుపాయాల లేమి, కనెక్టింగ్ రవాణా వ్యవస్థలు సజావుగా లేకపోవడం వల్ల.. దాన్ని వాడగల వారికి ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారు. పైగా మెట్రో మార్గాల్లో ఇప్పుడున్న ప్రజారవాణా వ్యవస్థకు కొంత కోత పెడితే.. కష్టాలు పెరుగుతాయనే భయం కూడా ఉంది.

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు పనులు చాన్నాళ్లుగా జరుగుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారి మెట్రో పూర్తి అవగానే తెలంగాణ ప్రభుత్వం దానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలనుకుంటోంది. ప్రజలు ఆర్‌ టీసీ బస్సులకన్నా మెట్రోనే ఎక్కువగా ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఉంది. అందుకని మెట్రో రైళ్లు వెళ్లే దారిలో బస్సులను తగ్గించే ప్రయత్నంలో ఉందని సంకేతాలు వస్తున్నాయి.

నిజానికి ఇలా చేస్తే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మెట్రో రైళ్లకు పార్కింగ్ ఫెసిలిటి లేకపోవడం వల్ల వాహనాలు ఉండే వారికి కూడా అది సరిగ్గా ఉపయోగపడదు. కాస్త ఓపిక ఉన్నోళ్లు ట్రాఫిక్ అంటే చిరాకు పడేవాళ్లు తప్ప ఇంకెవరికీ మెట్రో అంత ఉపయోగపడదు. కొన్ని బస్సులు సందుల్లోంచి వెళ్తాయి - కానీ మెట్రో అలా కాదు. ‘ఒక ముసలాయన వస్తున్నాడన్నా’ అంటే బస్‌ డ్రైవరు కాస్త ఆపుతాడు - కాని మెట్రో ఆగదు. ఒక గంటలో ఇరవై బస్సుల దాకా వెళ్తే మెట్రోలు మాత్రం నాలుగో ఐదో వెళ్తాయి. మెట్రోకి ట్రాఫిక్కు ఉండదు, ఎక్కడా బ్రేక్డౌన్ లేదా పంఛర్ అవదు. ఈ మూడు సదుపాయాలు కోరుకునే వాళ్లకి మెట్రో చాలా మంచి ఆప్షన్ - కానీ సామాన్య ప్రజలకు బస్సులే సౌకర్యంగా ఉంటాయి అనడంలో సందేహమే లేదు.

మెట్రో రైళ్లకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలనుకోవడం మంచిదే కానీ, ఆయా రూట్లల్లో బస్సులను తగ్గించడం సరైన నిర్ణయం కాదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత డబ్బులు ఖర్చుపెట్టి మెట్రో రైలు ఏర్పాటు వల్ల ప్రజలు దానిని సరిగా ఉపయోగించకపోతే ఏంటి లాభం అని ప్రభుత్వం అనుకోవచ్చు, కానీ మెట్రో వల్ల వచ్చే వ్యాపారం కన్నా దాని వల్ల వచ్చే అభివృధ్ధి ఎక్కువ. మెట్రో రైలు మార్గాల్లో వాటి వినియోగానికి అవసరమైన అన్ని అనుబంధ ఏర్పాట్లూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు  - ఆ మార్గాల్లో ఆర్టీసీ బస్సుల వంటి ప్రజారవాణా వ్యవస్థలను తగ్గించకుండా ఉంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.
Tags:    

Similar News