తెలంగాణలో కరోనాకు ప్రత్యేక ఆస్పత్రి

Update: 2020-03-03 08:43 GMT
దేశంలో ఒక్కసారిగా కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. గతంలో కేరళలో పాజిటివ్ కేసు రాగా తాజాగా ఇద్దరు పాజిటివ్ కేసులు రావడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీకి చెందిన ఒకరు - హైదరాబాద్ కు చెందిన ఒకరు ఆ వైరస్ బారిన పడడంతో కేంద్ర మార్గదర్శకాలతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వైరస్ విస్తరించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ వైరస్ అనుమానితులు - సోకిన వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు.

హైదరాబాద్ కు చెందిన వ్యక్తి వైరస్ సోకిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఈటల రాజేందర్ స్పందించారు. అది వాస్తవమేనని హైదరాబాద్ లోని మహేంద్రహిల్స్ కు చెందిన ఓ యువకుడు (24)కు వైరస్ వ్యాపించిందని - అయితే ఆ వైరస్ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు సోకిందని వివరించారు. దీంతో తెలంగాణ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు. వైరస్ సోకిన వ్యక్తికి నిపుణుల పర్యవేక్షణలో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు కూడా తెలిపారు. ఆ యువకుడి కుటుంబసభ్యులను కూడా పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తాము చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలు కూడా సహకరించాలని - ఎవరూ వదంతులు - పుకార్లు సృష్టించవద్దని హితవు పలికారు. దీంతో పాటు తెలంగాణలో ఆ వైరస్ వ్యాప్తి చెందేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని, దీంతో ప్రజలందరూ నిక్షిప్తంగా ఉండాలని సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై తాజాగా హైదరాబాద్ లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఈటల రాజేందర్‌ - కేటీఆర్‌ - ఎర్రబెల్లి దయాకర్‌ రావు - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ - ఆయా శాఖల ఉన్నతాధికారులు కరోనా వైరస్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. పురపాలక - పంచాయతీరాజ్‌ - వైద్య శాఖ అధికారులతో కలిసి మంత్రులు సమీక్షించారు. ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ 040 24651119 ఏర్పాటుకు నిర్ణయించారు. ఇది 24 గంటల పాటు నడిచే కాల్‌ సెంటర్‌తో పాటు ఇప్పుడున్న కాల్‌ సెంటర్‌ సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నారు.

కరోనా వైరస్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ వైరస్‌ తో మరణిస్తారనే ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. కరోనా చికిత్సకు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్‌పై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఈ మేరకు మంత్రులు నిర్ణయించారు. ప్రజలను చైతన్యం చేసేలా సమాచార, ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలుగు, ఆంగ్లం‌, ఉర్దూ భాషల్లో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేందుకు హోర్డింగ్‌లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

Tags:    

Similar News