ఇంకో ఓట్ల ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌

Update: 2018-03-19 08:25 GMT
స‌హ‌జంగా..ప్ర‌జాక‌ర్ష‌క పథ‌కాలు ఎలా - ఎప్పుడు ప్ర‌క‌టిస్తారు? ఎన్నిక‌ల స‌మ‌యంలో ...బ‌హిరంగ స‌భ‌ల రూపంలో! ఏ నాయ‌కుడు అయినా ఇదే చేస్తాడు.  పైగా రాజ‌కీయాల్లో ఆరితేరిన నాయ‌కులు అయితే ప‌క్కా ఇదే చేస్తుంటారు. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మిగ‌తా వారంద‌రి కంటే భిన్న‌మైన నాయ‌కుడు అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు క‌దా? అలాంటి త‌న ప్ర‌త్యేక‌త‌తో తాజాగా ఇంకో స్కీంను కేసీఆర్ ప్ర‌క‌టించారు. కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పెంచుతున్నట్లు శాసనసభలో సీఎం కేసీఆర్ స‌భా వేదిక‌గా ప్రకటించారు. రూ. 75 వేల నుంచి రూ. లక్షా 116లకు పెంచుతున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

అసెంబ్లీ వేదిక‌గా ఈ పథ‌కంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వివ‌రించారు. పేదరికం మనషుల్ని అనేక రకాలుగా వేధిస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `పెళ్లి కోసం ఖర్చును ఊహించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పెళ్లిళ్లు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారు. పరిపాలనలో అడుగడుగునా మానవీయ విలువలు ప్రతిబింబించాలని భావించి.. పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థికంగా అండదండగా నిలువాలని కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం వ్యక్తిగతంగా తన హృదయానికి దగ్గరైన పథకం. జనం మెచ్చిన పథకం` అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నిరుపేదలకు అండదండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి - షాదీముబారక్ సాయం పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నామ‌ని శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇక నుంచి కల్యాణలక్ష్మి - షాదీముబారక్ సాయాన్ని రూ. 1,00,116లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మొదట రూ. 51 వేలు - ఆ తర్వాత రూ. 75 వేలకు పెంచారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 లక్షల 65వేల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని సీఎం తెలిపారు.

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ ధన్యవాదాలు తెలిపారు.ఈ పెంపుపై సభలో సీఎం ప్రకటన ముగిసిన వెంటనే బొడిగే శోభ.. కేసీఆర్ వద్దకు వచ్చి ధన్యవాదాలు తెలిపారు. కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం పెంపుపై రాష్ట్ర మహిళా లోకం హర్షిస్తుంద‌ని తెలిపారు.
Tags:    

Similar News