తమతో పాటు ఏపీ గురించి తెలంగాణ సర్కారు లేఖ

Update: 2016-02-20 05:10 GMT
అవసరానికి తగినట్లుగా వ్యవహరించటం తెలివైనోళ్ల పని. తమకు మేలు జరుగుతున్నప్పుడు.. అందుకు తోడుగా పక్క వాళ్లను కలుపుకెళ్లటం మంచిది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు అదే తీరులో వ్యవహరిస్తోంది. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు మీద దృష్టి పెట్టిన తెలంగాణ సర్కారు.. అందుకు తగ్గట్లే తన పనిని షురూ చేసింది.

ఈ ఇష్యూలో తాను ఒక్కటే ప్రయత్నిస్తే సరిపోదని.. ఏపీ సర్కారు కూడా కలవాలన్న అంశాన్ని తెలివిగా కవర్ చేస్తూ.. ఏపీ తరఫున తానే డిమాండ్ చేస్తూ కేంద్రానికి తాజా లేఖ రాయటం గమనార్హం. తెలంగాణతో పాటు.. ఏపీలోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని కోరింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్ని 153కు.. ఏపీలోని 175 స్థానాల్ని 225 స్థానాలకు పెంచాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ సర్కారు లేఖ రాసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రొవిజన్ (3) ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను.. నియోజకవర్గాల పరిధిని పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉందని.. ఈ ప్రక్రియ త్వరగా చేపట్టాలని తెలంగాణ సర్కారు కోరింది. ఏమైనా.. పంచాయితీల కోసం పక్క రాష్ట్రం మీద ఫిర్యాదులు చేయటానికి బదులు.. తమ మాదిరే పక్క రాష్ట్రంలో నియోజకవర్గాలు పెంచాలంటూ అడక్కుండానే మాట కలిపిన తీరు కొత్త పరిణామమే. అవసరానికి తగ్గట్లు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర వైఖరిని ఏపీ సైతం ఫాలో కావాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News