ఉత్తము ల్లో ఆ వర్గంనుంచి ఒక్కరూ లేరా?

Update: 2015-09-06 07:08 GMT
ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ దేశం చాలా ఘనంగా జరుపుకుంది. భావి తరాలను తీర్చిదిద్దే వృత్తిలో ఉండే మహనీయులైన టీచర్ల సేవలను ఘనంగా స్మరించుకున్నది. ఈ సందర్భంగా.. మండలాల నుంచి జాతీయ స్థాయి వరకు ఉత్తమ ఉపాధ్యాయులకు వివిధ దశలో అవార్డుల ప్రదానం కూడా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి కూడా పలువురు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులు ఇచ్చే విషయంలో సామాజిక వర్గాల పరంగా ఒక వర్గానికి అన్యాయం జరిగిందనే వాదన తెలంగాణలో వినిపిస్తోంది.

సాధారణంగా.. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఫార్సుల ఆధారంగా మాత్రమే ఢిల్లీలో ప్రకటిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారానికి సిఫారసు చేసేప్పుడు ప్రభుత్వాలు కూడా.. కులాలు, సామాజిక వర్గాల పరంగా బ్యాలెన్స్‌ పాటించేలాగా.. జాగ్రత్తలు తీసుకుంటాయి. అన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలనుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటాయి.

అయితే ఈసారి తెలంగాణ నుంచి బలమైన సామాజిక వర్గమైన రెడ్డి వర్గంలో కనీసం ఒక్కరికి కూడా అవార్డు రాలేదు. అదే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్కరు రెడ్డి వర్గానికి చెందిన టీచరు కు నేషనల్‌ అవార్డు వచ్చింది. నిజానికి ఏపీ నుంచి మొత్తం,.. 9 మంది టీచర్ల కు రాగా, తెలంగాణ నుంచి 8 మందికే వచ్చాయి. అందులో కూడా రెడ్డి వర్గానికి చెందిన వారు ఒక్కరూ లేరు.

కేసీఆర్‌ సర్కారు గద్దె ఎక్కిన నాటినుంచి.. రాష్ట్రంలో రెడ్డి వర్గాన్ని తొక్కేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని, వారిని చిన్నచూపు చూస్తున్నారని రకరకాల పుకార్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి పుకార్లకు బలం చేకూర్చే విధంగా.. చివరికి ఇలాంటి ఉపాధ్యాయ అవార్డులకు చేసే సిఫారసుల్లో కూడా.. రెడ్డి వర్గం నుంచి ఎవరూ లేకపోవడం అనేది ప్రజల్లో అలాంటి అనుమానాలను బలపరుస్తోంది.
Tags:    

Similar News