చంద్ర‌ బాబుకు తోడెవ‌రు?

Update: 2018-05-11 16:22 GMT
తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న దూకుడును కొన‌సాగిస్తున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేసిన కేసీఆర్ ఈ విష‌యంలో గ‌తంలో వ‌లే సంయ‌మ‌నం పాటించడం కంటే ఆయ‌న్ను టార్గెట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో క‌స‌ర‌త్తు పెంచార‌ని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తమ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి గెలుపుకోసం టీఆర్‌ ఎస్ నామినేట్ చేసిన‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ తో చంద్ర‌బాబు ఫోన్‌ లో మాట్లాడినట్టు రికార్డయిన విషయం తెలిసిందే. ఆ ఆడియోలో ఉన్నది చంద్రబాబు స్వరమేనని చండీగఢ్‌ లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికనిచ్చింది. దీంతో కేసులో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ఈ కేసులో స్టీఫెన్‌ కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని ఏ1గా - సెబాస్టియన్‌ - ఉదయ్‌ సిన్హా - మత్తయ్యలను వరుసగా ఏ2 - ఏ3 - ఏ4లుగా మొదట ఏసీబీ ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసింది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏ 5గా నమోదు చేసి రెండు చార్జిషీట్లను వేసింది. ఇక ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి పాత్రకు సంబంధించి ఆయన వాయిస్‌ రికార్డు ప్రధాన సాక్ష్యంగా మారిందని, దీంతో ఆయన పేరును ఈ కేసులో చేర్చి చార్జిషీట్‌ ను దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

ఓటుకు నోటు కేసులో బాబును ప్యాకప్ చేసే విష‌యంలో ఎలాంటి పొర‌పాట్ల‌కు తావు ఇవ్వొద్ద‌ని కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. చంద్రబాబుపై చార్జిషీట్‌ ను రూపొందించే క్రమంలో పొరపాట్లకు తావివ్వకుండా ఏసీబీ ఉన్నతాధికారులు నిశితంగా దృష్టి సారించారని తెలిసింది. ఈ మేరకు న్యాయనిపుణులతో ఏసీబీ చీఫ్‌ పూర్ణచంద్రరావు సుధీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. కేసు పూర్వాపరాలను బట్టి చంద్రబాబును ఈ కేసులో ఎన్నో నిందితునిగా చేర్చాలి? ఏ సాక్ష్యాలను పొందుపర్చాలి? బాబు మాట్లాడిన సెల్‌ఫోన్‌ ఆడియో రికార్డులో ఎక్కడా నేరుగా ఓటు గురించి ప్రస్తావన లేక పోవడం వలన - ఇందులో ఏ విధంగా దానిని క్రోడీకరించాలి? మొదలైన కోణాలలో నిపుణులతో ఏసీబీ అధికారుల మధ్య చర్చ సాగుతున్నట్టు తెలిసింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వేయనున్న మూడో చార్జిషీట్‌లో ఎవరెవరి పేర్లను చేర్చాలనే విషయంలో ఏసీబీ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. ఈ కేసు ప్రారంభంలో కీలక పాత్ర వహించిన అప్పటి అదనపు ఎస్పీ - ప్రస్తుతం జనగామ ఎస్పీ మల్లారెడ్డి సహాయాన్ని కూడా తీసుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే అప్పటి ఏసీబీ డీజీ ఎకె ఖాన్‌ సైతం కేసు పూర్వాపరాలతో పాటు ఇందులో ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాలపైనా తన సలహాలను ఇచ్చారట‌. తన ఎంపిక కోసమే ఈ వ్యహారమంతా సాగింది కాబట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డిని ఈ కేసులో సాక్షిగా చూడాలా? నిందితుల జాబితాలో చేర్చాలా? అనే విషయమై నిపుణులతో సంప్రదింపులు సాగుతున్నాయని సమాచారం. వీటన్నింటికంటే ముఖ్యంగా స్టీఫెన్‌ కు రేవంత్‌ రెడ్డి అందచేసిన రూ. 50 లక్షలు ఎక్కడివి? ఎవరిచ్చారు? ఈ మొత్తాన్ని ఒక్కరి నుంచే సేకరించారా? మరికొందరు ఉన్నారా? అనే కోణంలో తగిన ఆధారాల కోసం ఏసీబీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ డబ్బులకు సంబంధించి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఆ సమయంలో ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అదే సమయంలో ప్రస్తుత ఏపీ మంత్రి లోకేష్‌ డ్రైవర్‌ అయిన రెడ్డిని విచారించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ, ఏసీబీ అధికారులకు చిక్కకుండా అదే సమయంలో రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతన్ని విచారిస్తే ఈ డబ్బుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తు న్నారు. ఇక మత్తయ్య సైతం తాను అప్రూవర్‌గా మారతున్నట్టు సుప్రీంకో ర్టులో పిటిషన్‌ వేసినట్టు వచ్చిన సమాచారం ఆధారంగా అతన్ని ఈ కేసులో తమకు అనుకూలంగా ఏవిధంగా వాడుకోవాలన్నదానిపై చర్చ నడుస్తున్నట్టు తెలిసింది. స్థూలంగా బాబు స‌హా ఆయన పార్టీకి చెందిన మాజీ నేత‌ల‌కు బుక్ చేయ‌డం ల‌క్ష్యంగా ప‌క్కా అడుగుల‌తో సాగుతున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News