సెక్ర‌టేరియ‌ట్‌ లో దుబాయ్ ట‌వ‌ర్స్‌

Update: 2016-06-04 09:39 GMT
దుబాయ్ అంటేనే ఎత్తైన భ‌వ‌నాల‌కు పెట్టింది పేరు. అద్భుత‌మైన భ‌వనాలు అర‌బ్ దేశాల‌కు ప్ర‌త్యేక అందాన్ని తీసుకువ‌స్తున్నాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. ఇపుడు అదే త‌ర‌హా భ‌వ‌నాలు హైద‌రాబాద్‌ లో కొలువుదీర‌నున్నాయి. అదికూడా న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న సెక్ర‌టేరియ‌ట్‌ లో. అదేలాగా అనుకుంటున్నారా? ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సచివాలయాన్ని కొద్దికాలం త‌ర్వాత‌ పడగొట్టి వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబ‌ట్టి!

ఉమ్మ‌డి రాజ‌ధాని అయిన హైద‌రాబాద్‌ లోని భ‌వనాల‌ను పదేళ్లపాటు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నప్ప‌టికీ సచివాలయ భవనాలను ముందుగానే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్త‌లు వెలువడిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కేవలం ఒకే ఒక్క భవనాన్ని ఏపీ స‌ర్కారు త‌న‌ చేతిలో ఉంచుకుని మిగిలిన వాటిని తెలంగాణ స‌ర్కారుకు ఇచ్చేందుకు ఆలోచన చేస్తోంది. ఒకటి రెండు నెలల్లోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఇలా వ‌చ్చిన స్థలంలో వాణిజ్య భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ ఆలోచ‌న‌లో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిటేట్స్‌ (యుఎఇ)తో చెందిన ఒక సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిసింది. సచివాలయంలోని భవనాల స్థానంలో కొత్తవి నిర్మించి వాటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు కసరత్తు ప్రారంభమైనట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా సచివాలయాన్ని ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసిన‌ట్లు చెప్తున్నారు.  ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ లో సచివాలయంలోని ఐదు బ్లాకులను పదేళ్లపాటు వినియోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ స‌ర్కారుకు ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం జూన్‌ 27లోగా ఉద్యోగులను తరలించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులను స్కెలిటిన్‌ స్టాఫ్‌ గా హైదరాబాద్‌లోనే ఉంచాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ సంఖ్యను మరింత తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఉన్న ఐదు బ్లాకుల్లో ఎల్‌-బ్లాకును మాత్రమే ఉంచుకుని, మిగిలిన కె - ఎల్‌ - హెచ్‌-నార్త్‌ - హెచ్‌-సౌత్‌ బ్లాకులను తెలంగాణకు ఇచ్చి వేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు గతంలోనే సచివాలయ భవనాలను ఖాళీ చేసి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స‌ర్కారుకు చెప్పినట్లు ప్రచారంలో ఉంది.
Tags:    

Similar News