కేసీఆర్ - కేటీఆర్ సారూ ఆదుకోండి: సాయం కోసం గ‌ల్ఫ్‌ లో తెలంగాణ బిడ్డ‌ల విజ్ఞ‌ప్తి

Update: 2020-05-02 14:30 GMT
కరోనా వైర‌స్ దెబ్బతో ఎడారి ప్రాంత దేశాల్లో కూడా పనులు ఆగిపోయాయి. ఆ దేశాలు కూడా లాక్‌డౌన్‌ను కొన‌సాగిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఆ దేశాల‌కు పెద్ద సంఖ్య‌లో తెలంగాణ ప్ర‌జ‌లు వెళ్తారు. ప్ర‌స్తుతం ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గ‌ల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నారు. ప‌ని లేక‌పోవ‌డం.. బ‌య‌ట తిర‌గ‌క‌లేక‌పోవ‌డం వంటి వాటితో నాలుగ్గోడ‌ల మ‌ధ్య చిక్కుకుపోయారు. దీంతో వారంతా పనులు లేక క్యాంపులకే పరిమితమయ్యారు. ప్ర‌స్తుతం వారంతా భార‌త‌దేశ స‌హాయం కోరుతున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చే మార్గాలు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ మేర‌కు విదేశాంగ శాఖ‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు చేస్తున్నారు.

తెలంగాణ‌లోని ఉమ్మడి కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ జిల్లాల నుంచి అనేకమంది దుబాయ్‌ తోపాటు పలు గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తారు. ప్ర‌స్తుతం అలా వెళ్లిన వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. గ‌ల్ఫ్ దేశాల్లో ప్ర‌స్తుతం తెలంగాణ‌ ప్ర‌జ‌లు తిండి లేక - చేతిలో డ‌బ్బు లేక దిన‌దిన గండంగా బ‌తుకుతున్నారు. ఈ క్ర‌మంలో వందల మంది ఉంటున్న క్యాంపుల్లో సరిగ్గా కరోనా టెస్ట్‌లు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్లను కూడా తమతోనే కలిపి ఉంచుతున్నారని చెబుతున్నారు. వేరేచోటికి వెళ్లేందుకు త‌మ‌కు అనుమతించడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై అక్క‌డి తెలుగు సంఘాల‌ను ఆశ్ర‌యిస్తూనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, -కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని త‌మ‌ను రక్షించాలని గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు కోరుతున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ - మంత్రి కేటీఆర్లు కూడా గల్ఫ్ బాధితుల విషయంలో చొరవ చూపించాలని వారిని ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.
Tags:    

Similar News