ఆ రెండు న్యూస్ చానెల్స్ కు షాకిచ్చిన హైకోర్టు!

Update: 2023-05-31 14:56 GMT
వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు బెయిల్ తీర్పు కు ముందు  కొన్ని మీడియా చానెల్స్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈనెల 26న ఏబీఎన్, మహా టీవీ ఛానెళ్లలో జరిగిన  చర్చలో న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు చేసిన సస్పెండ్ అయిన జడ్జి రామ కృష్ణ మీద తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినాష్ కేసు విషయంలో హైకోర్టు జడ్జీలకు డబ్బు సంచులు వెళ్లాయని, అందుకే అయన అరెస్ట్ కావడం లేదని మాజీ రామకృష్ణ వ్యాఖ్యలు చేసారు.. ఇదంతా ఆ ఛానెళ్లలో ప్రసారం అయింది. ఈ ఆరోపణలను నేడు కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆ ఛానెళ్లలో జరిగిన చర్చలు, ఆ వీడియో ఫుటేజీ మొత్తం తమ ముందు ఉంచాలని హైకోర్టు న్యాయమూర్తి  లక్ష్మణ్ హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించారు.

కేవలం హైకోర్టు న్యాయమూర్తులు డబ్బు సంచులు తీసుకుని అవినాష్ ను అరెస్ట్ చేయకుండా సీబీఐ నుంచి కాపాడుతున్నారని ఆరోజు టివి డిబేట్లలో సస్పెండ్ అయిన జడ్జి  రామకృష్ణ ఆరోపణలు చేసారు. ఈ చర్చల్లో పాల్గొన్న కొందరు పాత్రికేయులు సైతం రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పారని హైకోర్టు అభిప్రాయపడింది. ఏబీఎన్ ఛానెల్లో జరిగిన ఈ డిబేట్ లో బిజెపి నాయకుడు విల్సన్, మాజీ జడ్జి రామకృష్ణ పాల్గొనగా చర్చను జర్నలిస్ట్ పర్వతనేని వెంకట కృష్ణ నిర్వహించారు.  అయితే ఈ విషయంలో హైకోర్టు న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు మీడియా అంటే గౌరవం ఉందని, కానీ ఆరోజు తమ మీద అలాంటి వ్యాఖ్యలు చేయడంతో తాము కలత చెందామని న్యాయమూర్తి ఆవేదన చెందారు. అంతేకాకుండా దీన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఆ వీడియో ఫుటేజీ మొత్తం డౌన్లోడ్ చేసి తమకు ఇవ్వాలని ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్న మాటలు సంచలనంగా మారాయి. ‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్ఛకు మేం అడ్డంకి కాదు. కానీ కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. ఒక స్థాయిలో విచారణ నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ సుప్రీం ఆదేశాలు, పవిత్రమైన న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణ కొనసాగించాను. న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. దీనిపై చర్య తీసుకోవాలా? వద్దా? అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని’ కోర్టు స్పష్టం చేసింది.

 నిజానికి ఈ కేసులో అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ కి అనుకూలంగా కోర్టులు ఉత్తర్వులు ఇస్తే న్యాయమూర్తులు గొప్పగా వ్యవహరించారని, నిందితులకు సరైన గుణపాఠం తప్పదని గంటలకొద్దీ చర్చలు ఇవే చానళ్లు నడిపాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. కోర్టుల మీద ఆరోపణలు చేయరాదని సదరు టివి ఛానెళ్ళలో డిబేట్లు నడిపిన సీనియర్ జర్నలిస్ట్ కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడీ వ్యవహారంలో ఈ ఛానెళ్ల మీద కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
 
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీల్లో ఈ చర్చలు జరిగాయి. ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఈ చర్చ పెట్టగా.. చర్చలో మాజీ జడ్జి రామకృష్ణ పాల్గొని ఈ హైకోర్టుపేనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాటీవీలోనూ ఇదే చర్చ పెట్టి చర్చించారు.  హైకోర్టు ఈ ఛానెళ్లపై చర్యలకు ఉపక్రమించడం సంచలనమైంది.

Similar News