అంతా కేసీఆర్ వల్లే..ఐఏఎస్ ల గరంగరం..

Update: 2019-07-29 05:25 GMT
అఖిల భారత సర్వీసు అధికారులుగా  స్వతంత్రంగా వ్యవహరించే ఐఏఎస్  - ఐపీఎస్ లకు కేసీఆర్ సర్కారు అడ్డుకట్టవేస్తోందన్న అసహనం వారిలో పెరిగిపోతుందా.? వరుసగా ఓ ఐపీఎస్ - తాజాగా ఓ ఐఏఎస్ తిరుగుబావుటా ఎగురవేయడం వెనుక కారణాలేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. అయితే ఇందులో ఐఏఎస్ - ఐపీఎస్ ల   దూకుడు కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది.  ఇప్పుడు అసంతృప్త ఐఏఎస్ లు ఐపీఎస్ లు - ప్రభుత్వం మధ్య ఈ పొరపొచ్చాలు తెలంగాణ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

తెలంగాణ అఖిల భారత సర్వీసు అధికారుల్లో ఫస్ట్రేషన్ పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. వారి దూకుడే వారికి అడ్డుకట్ట పడుతోంది. అయితే లూప్ హోల్స్ పోస్టులకు వెళ్లిన వారు ఇప్పుడు నిరసన గళం వినిపిస్తుండడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది..

కొద్దిరోజుల క్రితం తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా స్వతంత్రంగా వ్యవహరించిన వీకేసింగ్ దూకుడు వ్యవహారశైలి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆయన ప్రభుత్వంతో సంప్రదించకుండానే మార్పులు - చేర్పులు - సంస్కరణలు చేశారన్న చర్చ అధికారవర్గాల్లో సాగింది. అందుకే ఆయనను మార్చి ప్రాధాన్యం లేని స్టేషనరీ - ప్రింటింగ్ శాఖకు మార్చింది. దీనిపై వీకేసింగ్ నిరసన గళం వినిపించారు..

ఇక తాజాగా తెలంగాణలో మరో ఐఏఎస్ మురళి నిరసన గళం వినిపించారు. భూపాల జిల్లా కలెక్టర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు - దుండుడుకు చర్యలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. సొంతంగా జిల్లాలో సంస్కరణలు చేసిన ఆయన తీరు వివాదాస్పదమైంది. దీంతో మురళిని ప్రభుత్వం లూప్ లైన్ పోస్టుకు బదిలీ చేసింది. అక్కడ పని ఏమీ లేకపోవడంతో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి  తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 31కి రిటైర్ అవుతానని ప్రకటించారు.

ఇలా ఓ ఐపీఎస్ - ఐఏఎస్ లు కేసీఆర్ సర్కారుపై నిరసన గళం వినిపించారు. అనగారిన కులానికి చెందిన తనను అణగదొక్కారని ఐఏఎస్ మురళి.. ఇక ఉత్తరాది వాడినని తొక్కేస్తున్నారని వీకేసింగ్ తెలంగాణ సర్కారుపై అభాండాలు వేశారు. కేసీఆర్ సర్కారు అగ్ర వర్ణాల అధికారులకే అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణ సర్కారు మాత్రం వారు ప్రభుత్వంతో సంప్రదించకుండా దుందుడుకు వ్యవహారశైలి వల్లే ఈ పరిస్థితి కొనితెచ్చుకున్నారని స్పష్టం చేస్తున్నారు.


 
Tags:    

Similar News