తెలంగాణా అంటే ఏపీకి మూడు రెట్లు ....ఇదీ లెక్క

Update: 2022-08-17 10:02 GMT
తెలంగాణా రాష్ట్రాన్ని కల కాదు అని గట్టిగా చెప్పి నిజం చేసిన కేసీయార్ ఎనిమిదేళ్ళ ముఖ్యమంత్రిత్వంలో తనదైన వ్యూహాలను అమలు చేస్తూ పోతున్నారు. ఆయన పరిపాలన కూడా తనదైన  మార్క్ ని చూపిస్తుంది. ఇక విభజన తరువాత ఏపీ అభివృద్ధి చెందుతుంది తెలంగాణా ఇబ్బందులో పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అది తప్పు అని నిరూపించామని కేసీయార్ అంటున్నారు.

ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని అన్ని రకాలైన సదుపాయాలు తెలంగాణాలో ఉన్నాయి. తెలంగాణాలో సంక్షేమ పధకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని, వీటిని చూసి పొరుగు రాష్ట్రాలు కూడా తమతో కలవాలని అనుకుంటున్నాయి కేసేయార్ అనడం విశేషం. తెలంగాణాలో భూముల ధరలు బాగా పెరిగాయంటే అది అభివృద్ధి కాదా అని ఆయన తాజాగా వికారాబాద్  లో జరిగిన సభలో ప్రశ్నించారు.

తెలంగాణాలో ఒక ఎకరం ఏపీలో మూడు ఎకరాలతో సమానం అని ఆయన చెప్పడం విశేషం. ఇక్కడ ఒక ఎకరం అమ్మితే ఏపీలో మూడు ఎకరాలు కొనవచ్చు అని అన్నారు. అంతలా తెలంగాణాలో భూముల ధరలు పెంచగలిగామంటే అది కదా ప్రగతి అని ఆయన చెప్పుకున్నారు. ఇక సరిహద్దు కర్నాటక వాసులు తెలంగాణాతో కలవాలని చూస్తున్నారు అని కూడా అన్నారు.

కేంద్రం ఒక్క సంక్షేమ పధకం అయినా అమలు చేస్తోందా. పేదల నోట్లో మట్టి కొట్టి పెద్దలను పోషించడమే మోడీ సర్కార్ కి తెలుసు అని నిప్పులు చెరిగారు. అదే తమ పాలనలో కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రైతు భీమా కింది అయిదు లక్షలు ఇస్తున్నామని, ప్రాజెక్టులు ఉన్న చోట అయితే ఎలాంటి పన్నులే లేకుండా ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నామని కూడా ఆయన తెలియచేశారు.

రైతులకు రైతు బంధుని అమలు చేయడమే కాకుండా నాణ్యమైన విద్యుత్ ని కూడా సరఫరా చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంట పెట్టుబడి కూడా రైతులకు తాము ఇస్తున్నామని ఈ విధంగా చూస్తే తెలంగాణా రైతు కంటే సుఖంగా ఎవరూ లేరని ఆయన అన్నారు.

దేశంలో మోడీ పాలనలో అన్ని విధాలుగా పేదలకు భారాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. కేంద్రం ఎనిమిదేళ్ళలో మంచి పని ఒక్కటీ చేయలేదని, పైగా తాము సంక్షేమ పధకాలు అమలు చేస్తూంటే రద్దు చేయమని చెప్పడం కంటే దారుణం వేరొకటి లేదని కేసీయార్ మండిపడ్డారు.

కేవలం సంస్కరణలు అంటూ కబుర్లు చెబుతూ పేదల పొట్ట కొట్టి డబ్బున్న వారి జేబులు నింపే కార్యక్రమమే బీజేపీ చేస్తోంది అని ఆయన ఆగ్రహించారు. దేశంలో ఉచిత పధకాలు రద్దు చేయమని చెబుతున్న కేంద్ర పెద్దలు బడాబాబులకు ఇరవలి లక్షల కోట్లు మాఫీ ఎలా చేశారని కేసీయార్ నిలదీశారు. ఇక ఉచిత విద్యుత్ రైతులకు వద్దని చెబుతున్న కేంద్రం పెద్దలకు మాత్రం లక్షల కోట్లు రద్దు చేసిందని నిందించారు.

తాను తెలంగాణా కోసం మోడీతోనే ఢీ కొడతానని, ఈ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అంటూ కేసీయార్ మరోసారి సవాల్ చేశారు. బీజేపీ విధానాలు అన్నీ మోసపూరితమైనవి అని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ ఎలా ఉన్నా తెలంగాణా కంటే ఏపీ అభివృద్ధిలో వెనకబడింది అన్న విషయాన్ని ఆయన సెటైరికల్ గా చెప్పడం మీదనే ఇపుడు చర్చ సాగుతోంది.
Tags:    

Similar News