కేసీఆరా..మ‌జాకానా?మిలియ‌న్ మార్చ్ అట్టర్ ఫ్లాప్

Update: 2018-03-11 09:45 GMT
ఉవ్వెత్తున ఎగిసిప‌డిన తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో మిలియ‌న్ మార్చ్ అన్న‌ది ఒక మైలురాయి. నాటి మిలియ‌న్ మార్చ్‌.. ఉమ్మ‌డి పాల‌కుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేయ‌ట‌మే కాదు..ఢిల్లీలోని యూపీఏ స‌ర్కారు సైతం ఎప్ప‌డేం జ‌రుగుతుందోన‌ని వ‌ణికిపోయిన ప‌రిస్థితి. నాటి మిలియ‌న్ మార్చ్ కు అన్నితానై ఉండి న‌డిపించిన ఘ‌న‌త‌ కోదండ‌రాం మాష్టారిది అయితే..తెర వెనుక వ్యూహాల్ని సిద్ధం చేసిన క్రెడిట్ కేసీఆర్ సొంతం.

చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. తాను ఏ రాష్ట్రం కోసం మిలియ‌న్ మార్చ్ పేరుతో కోట్లాడాడో.. ఇప్పుడ‌దే మిలియ‌న్ మార్చ్ ను తెలంగాణ స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టేందుకు నిర్వ‌హించాల్సి వ‌చ్చింది. మీడియా మైకు క‌నిపిస్తే చాలు.. ఉమ్మ‌డి పాల‌కుల్ని చెడామ‌డా తిట్టేసిన కోదండం మాష్టారి మాట‌ల్ని ఛాన‌ల్స్ ద‌గ్గ‌ర నుంచి పేప‌ర్లు వ‌ర‌కూ ఎంత ప్రాధాన్య‌తను ఇచ్చి ప్రింట్ చేశాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. నాడు ఏ రాష్ట్రం కోసం పోరాడారో.. ఇప్పుడు అదే రాష్ట్రంలో మిలియ‌న్ మార్చ్ స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించుకునేందుకు సైతం స‌ర్కారు ఒప్పుకోక‌పోవ‌టం.. దానికి త‌గ్గ‌ట్లే త‌న వాయిస్ ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌లేక కోదండం అండ్ కో కిందా మీదా ప‌డిపోవ‌టం క‌నిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క‌భూమిక పోషించిన తెలంగాణ రాజ‌కీయ జేఏసీ నేతృత్వంలో నిర్వ‌హించిన మిలియ‌న్ మార్చ్ స్ఫూర్తియాత్ర అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. స‌భ‌కు భారీగా ఆందోళ‌కారులు త‌ర‌లివ‌స్తార‌ని ప్ర‌క‌టించిన కోదండం మాష్టారిని మాట‌లు నిజం కాద‌ని తేలిపోయింది. నిర‌స‌న‌కారులు స‌భ‌కు చేరుకోలేక‌పోయారు. అడుగ‌డుగునా పోలీసుల పుణ్య‌మా అని మిలియ‌న్ మార్చ్ తేలిపోయింది. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్ బండ్ మీద‌కు ఎవ‌రినీ అనుమ‌తించ‌క‌పోవ‌టం.. చుట్టూ రెండు వ‌రుస‌ల బారికేడ్లు.. ముళ్ల‌కంచెలు ఏర్పాటు చేయ‌ట‌మే కాదు.. ఆందోళ‌కారుల‌న్న అనుమానం వ‌చ్చిన ప్ర‌తిఒక్క‌రిని అదుపులోకి తీసుకున్నారు.

దీంతో.. మిలియ‌న్ మార్చ్ స్ఫూర్తి యాత్ర తేలిపోయింది. ప‌లువురు ఉద్య‌మ‌నేత‌ల్ని ముంద‌స్తుగా అరెస్ట్ చేయ‌ట‌మో.. హౌస్ అరెస్ట్ చేయ‌ట‌మో చేసేశారు. పోలీసుల తీరును ఉద్య‌మ నేత‌లు తీవ్రంగా మండిప‌డ‌ట‌మే కాదు.. ఎమ‌ర్జెన్సీని త‌ల‌పించేలా నిర్భందం రాష్ట్రంలో అమ‌ల‌వుతోంద‌ని వాపోతున్నారు.

ప్ర‌శ్నిస్తే చాలు అరెస్ట్ లు చేస్తున్నార‌ని విమ‌ల‌క్క‌.. సంధ్య‌.. అనురాధ లాంటి మ‌హిళా నేత‌లు ఫైర్ అయ్యారు.  ఇక  మిలియ‌న్ మార్చ్ స్ఫూర్తి యాత్ర‌కు డిజైన్ చేసిన కోదండ‌రాం అయితే.. ప్ర‌భుత్వ నిరంకుశ‌త్వం సిగ్గుప‌డేలా ఉంద‌న్నారు. ఉమ్మ‌డి పాల‌కుల‌కు మించిన రీతిలో కేసీఆర్ పాల‌న ఉంద‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు. తాము కోరుకున్న సొంతోళ్ల పాల‌న‌లో క‌నీసం త‌మ మ‌న‌సుల్లో ఉన్నది చెప్ప‌టానికి సైతం అవ‌కాశం లేకపోవ‌టాన్ని కోదండ‌రాం అండ్ కో జీర్ణించుకోలేక‌పోతున్నారు.
Tags:    

Similar News