కామారెడ్డి పొలిటిక‌ల్ క‌హానీ హీటెక్కుతోందిగా.. రీజ‌నేంటి?

Update: 2022-11-14 23:30 GMT
తెలంగాణ‌లోని కీల‌క‌మైన రాజ‌కీయ ప్రాధాన్యం ఉన్న జిల్లా కామారెడ్డి. ఇక్క‌డ‌, అధికార పార్టీటీఆర్ ఎస్ బ‌లంగా ఉంది. అయితే, ఇప్పుడు బీజేపీ ఇక్క‌డ పావులు క‌దుపుతోంది. ఇటీవ‌ల కొంద‌రు టీఆర్ ఎస్ నాయ‌కులు బీజేపీలోకి వెళ్లడం, మ‌ళ్లీ తిరిగి రావ‌డం తెలిసిందే. మునుగోడు ఉప పోరు త‌ర్వాత‌.. అంతా స‌ర్దుకుంటుంద‌నిఅనుకున్నా కామారెడ్డి పొలిటిక‌ల్ క‌హానీ మాత్రం హీటెక్కుతోంది. జిల్లాలో బీజేపీలోని ఓ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్‌లో ఉన్న మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓటమిపాలై టీఆర్ఎస్ నుంచి  బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన జాజుల సురేందర్ చాలా కాలం క్రితమే కేసీఆర్ పంచ‌న చేరిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ మ‌రోసారి పార్టీ మారుతున్నారంటూ పెద్దె ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయా నేత‌ల అనుచ‌రులు ఈ ప్ర‌చారాన్ని పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్తున్నారు.

ఏడాది క్రితమే బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి పాత గూటికి చేరబోతున్నారంటూ కొద్ది రోజులుగా ఎల్లారెడ్డి అంతటా ప్రచారం హల్‌ చల్ చేస్తోంది. ఏనుగు, జాజుల వ్యవహారం అటు బీజేపీలోను.. ఇటు టీఆర్ ఎస్ పార్టీలోను అలజడి రేపుతోంది. ఇటీవలే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వీరిద్దరి వ్యవహారం కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాక రేపుతోంది.

టీఆర్ఎస్ ఘర్ వాపసీలో భాగంగా.. ఇప్పటికే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటివారు..బీజేపీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఈ క్ర‌మంలోనే  ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్ రెడ్డి పేరు జోరుగా వినిపిస్తోంది. ఆయ‌న‌ పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పుడల్లా అనుచరులు ఆయన్ను అడగడం, పార్టీ మారేది లేదని రవీందర్ రెడ్డి ఖండించడం జరుగుతూనే ఉంది. అయితే, ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రచారం జరుగుతుండటం గ‌మ‌నార్హం.  

ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ కాలం నుంచీ టీఆర్ ఎస్‌పార్టీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ చేతిలో ఓటమి చెందారు.

కాంగ్రెస్ నుంచి గెలిచిన సురేందర్ కారు ఎక్కేయడంతో అలక వహించిన రవీందర్ రెడ్డి బీజేపీ పుచ్చుకున్నారు. అయితే, ఇటీవల  ఆయ‌న‌ తిరిగి గులాబీ గూటికి చేరతారంటూ  విస్తృత ప్రచారం జరుగుతోంది. పాత మిత్రులందరినీ దగ్గరకు తీస్తున్న అధికార టీఆర్ ఎస్ పార్టీ.. రవీందర్ రెడ్డికి సైతం సాదర ఆహ్వానం పలుకుతుందనే ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News