తెలంగాణ పోలీసుల‌కు బాబు స‌వాల్‌

Update: 2016-03-02 07:53 GMT
సంద‌ర్భం ఏదైనా శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య పోలీసుల‌దే. రెండు తెలుగు రాష్ర్టాల‌కు కీల‌క‌మైన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఇపుడు హైద‌రాబాద్‌ పోలీసుల‌కు స‌వాల్‌ గా మారనుంది. ఈ స‌వాల్‌ కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క కార‌ణం కావ‌డం మొత్తం ఎపిసోడ్‌ లో ఆస‌క్తిక‌ర అంశం.

ఈ నెలాఖరులోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్‌ ను ఆమోదించుకోవడం త‌ప్ప‌నిస‌రి. లేనిపక్షంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు నిలిచిపోవ‌డ‌మే కాకుండా అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతాయి. ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ర్టాలు త‌మ బ‌డ్జెట్ సెష‌న్స్‌ పై నిర్ణ‌యం తీసేసుకున్నాయి. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుండగా, 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూత్ర‌ప్రాయ నిర్ణ‌యం తీసుకున్నారు. రెండు బ‌డ్జెట్‌ లో హైద‌రాబాద్‌ లోని అసెంబ్లీ భ‌వ‌నంలోనే జ‌ర‌గుతుండ‌టం ఇపుడు న‌గ‌ర పోలీసుల‌కు పెను స‌మ‌స్య‌గా మారింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలను తొలుత తాత్కాలిక రాజ‌ధాని విజయవాడలో నిర్వహించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం భావించింది. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్ళడం సాధ్యం కాదేమోనని భావించి, చివరకు హైదరాబాద్‌ లోనే నిర్వహించాలని ఖ‌రారు చేశారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి రెండు వేర్వేరు అసెంబ్లీ భవనాలు ఉన్నా ఆవరణ చాలా చిన్నదిగా ఉండడం సమస్యగా మారింది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ భారీ కాన్వాయ్‌ లు, న‌లుగురు ఉప‌ముఖ్య‌మంత్రుల కాన్వాయ్‌ తో పాటు మంత్రులు - ఎమ్మెల్యేల వాహనాలతో శాస‌న‌స‌భా ప్రాంగ‌ణం కిక్కిరిసిపోనుంది. ఇది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారనుంది.

ఆంధ్ర పోలీసులతోనే భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా లోగడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర డీజీపీ ఆదేశించిన నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు అక్కడినుంచే పోలీసులు రానున్నారు. అయితే న‌గ‌రంలో ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌ - ముఖ్య‌మంత్రులు వెళ్లే స‌మ‌యంలో ట్రాఫిక్ నిలిపివేయ‌డం - మంత్రులు - విప్‌ లు - ఎమ్మెల్యేల‌కోసం ట్రాఫిక్ ప‌ర్య‌వేక్ష‌ణ పోలీసుల‌కు త‌ల‌కుమించిన భారంగా మార‌నుంది. పరోక్షంగా త‌మ పనితీరుకు చంద్ర‌బాబు స‌వాల్ విసిరారని హైద‌రాబాద్‌ పోలీసులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News