తెలంగాణలో సాగుకు పనికిరాని కరెంటు

Update: 2015-11-18 22:30 GMT
వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ నాయకుల ప్రధాన నినాదం ఏమిటో తెలుసా? మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనట్లుగా అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో కరెంటు ఇచ్చామని.. కరెంటు ఇబ్బందులను మటుమాయం చేశామని. ఇదే అంశాన్ని నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. విచిత్రం ఏమిటంటే, రబీ, ఖరీఫ్ సీజన్లకు ముందు వరి పంట వేసుకోవద్దని రైతులకు ప్రబుత్వమే అధికారికంగా పిలుపు ఇస్తోంది. వరి వేయకపోతే కరెంటు డిమాండ్ గణనీయంగా తగ్గిపోతోంది. దానిద్వారా మిగిలిన కరెంటును ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. పూర్తిస్థాయిలో కరెంటు ఇచ్చామని చెబుతోంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అన్ని రంగాలకూ పూర్తి స్థాయిలో కరెంటు ఇచ్చామని చెబుతోంది. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా ఎన్నికల్లో ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా రబీ సీజన్లోనూ అధికార పార్టీ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సమస్య కరెంటు. తెలంగాణలో ఉత్పత్తి లేకపోవడం.. కొనుగోలుకు ఇతర రాష్ట్రాల్లోనూ కరెంటు లేకపోవడం, కొనుగోలు చేసినా దానిని తెలంగాణకు తీసుకొచ్చేందుకు లైన్లు లేకపోవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. అదే సమయంలో ఎండాకాలం వచ్చింది. దాంతో గంటల తరబడి కోతలు విధించాల్సి వచ్చింది. ఆ అనుభవంతోనే ఖరీఫ్ సీజన్లో వరి వేసుకోవద్దని రైతులకు ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసింది. కేవలం ఆరు తడి పంటలే వేసుకోవాలని పిలుపునిచ్చింది. దాంతో రైతులు వరి జోలికి వెళ్లలేదు. పంటలను ఎండబెట్టుకుని ఇతర పంటలు వేసుకున్నారు. దాంతో కరెంటు భారీగా మిగిలింది. వర్షాలు కూడా వచ్చాయి. దాంతో ఇతర అవసరాలకు ప్రభుత్వం కరెంటు ఇచ్చింది. దీనినే తమ ఘనతగా చెప్పుకొంటోంది. వరంగల్ ఎన్నికల్లోనూ ఇదే చెప్పుకొంది. తాజాగా రబీ సీజన్ వచ్చింది. దాంతో ప్రభుత్వం మళ్లీ పాత ఆయుధాన్నే తెరపైకి తెచ్చింది. రబీలో వరి వేయవద్దని, వేస్తే బోర్లు సీజ్ చేసి తీసుకుపోతామని హెచ్చరిస్తోంది. రబీ చివరికి వచ్చే సరికి కరెంటు ఎక్కువ కావాలి. అప్పటికి ఎండా కాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పుడు రెండింటికీ కరెంటు ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అందుకే రైతులపై ఆంక్షలు విధిస్తోంది. అయితే, రైతులు ఎన్ని పంటలను ఎండబెట్టుకుంటారు. అందుకే ఇప్పుడు రైతులు తిరగబడుతున్నారు. తెలంగాణలో ఇది మరో పెద్ద సమస్య కానుంది.
Tags:    

Similar News