31 రాష్ట్రాల్లో 30వ స్థానం లో తెలంగాణ .. ఎందులో అంటే ?

Update: 2020-01-04 10:25 GMT
దేశం లో ట్రైబల్ లిటరసీ విషయం లో తెలంగాణ అట్టడుగు భాగాన నిలిచింది. కేవలం 49.5 శాతం అక్షరాస్యత రేటుతో మొత్తం 31 రాష్ర్టాల్లో 30వ స్థానం లో నిలిచింది. ఎస్టీలలో లిటరసీ రేటు దేశంలో సగటున 59 శాతం ఉండగా, తెలంగాణ లో దాదాపు పదిశాతం తక్కువ నమోదు కావడం గమనార్హం. అతి తక్కువ అక్షరాస్యతతో కింది నుంచి మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. గిరిజనులను అక్షరాస్యులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు పెడుతున్నా, అవి అనుకున్నంత ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. దేశ అక్షరాస్యత సగటు 73 శాతం ఉండగా, రాష్ర్ట విభజన తర్వాత రాష్ట్రంలో లిటరసీ 66.54 శాతంగా ఉన్నది. 2014లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ర్ట జనాభా 3.63 కోట్లు కాగా, ఇందులో గిరిజన జనాభా 36.02 లక్షలు గా ఉంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లోనే ట్రైబల్ జనాభా ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం గిరిజన శాఖ, విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్కూళ్లు కొనసాగిస్తోంది. విద్యాహక్కు చట్టం రావడంతో స్కూల్స్ లో గిరిజన స్టూడెంట్లు చేరుతున్నా, వివిధ కారణాలతో మధ్యలోనే బడి మానేస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.

దేశంలో మొత్తంగా గిరిజన అక్షరాస్యత 59 శాతంగా ఉంది. 31 రాష్ర్టాల్లో 50 శాతంలోపు లిటరసీ రేటు ఉన్న రాష్ర్టాలు రెండే ఉండగా, అవి తెలుగు రాష్ర్టాలే కావడం గమనార్హం. రాష్ట్రం లో గిరిజన అక్షరాస్యత 49.5 శాతం కాగా, మొత్తంగా అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ ( 48.8శాతం) నిలిచింది. గిరిజన లిటరసీ లో లక్షదీప్ (91.7 శాతం) టాప్ లో నిలిచింది. లోక్ సభ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్న కు కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఇచ్చిన లెక్కల తో ఈ వివరాలు వెలుగు లోకి వచ్చాయి. 2018–19లో స్కూల్ ఎడ్యుకేషన్ కు 4,924.65 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ కు రూ.1,251.48 కోట్లు ఇచ్చింది. తెలంగాణ లోనూ జనాభా కు అనుగుణంగా నిధులొచ్చాయి. అయినా గిరిజన అక్షరాస్యతలో పెద్దగా మార్పు కనిపించడం లేదని గిరిజన సంఘాల నేతలు చెప్తున్నారు.


Tags:    

Similar News