ప్ర‌జా గాయ‌కుడు నిసార్ ను బలితీసుకున్న కరోనా!

Update: 2020-07-08 15:00 GMT
ప్ర‌జా గాయ‌కుడు నిసార్ మ‌హమ్మ‌ద్ కరోనా మహమ్మారి కారణంగా క‌న్నుమూశారు. కరోనా భారిన పడి గత కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని గాంధీలో కరోనాకి చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషయమించడంతో ఈ రోజు ఉద‌యం ఆయ‌న మృతి చెందారు. కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!’ అంటూ కరోనాపై కలం గురిపెట్టిన నిస్సార్‌ అకాల మరణంపై పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల‌ను, తెలంగాణ గుండె చ‌ప్పుళ్ల‌ను త‌న పాట‌ల‌తో ఎలుగెత్తి చాటిన తెలుగు క‌వి, గాయ‌కుడు నిసార్ మ‌హ‌మ్మ‌ద్. మొద‌ట ఆర్టీసీలో కండ‌క్ట‌రుగా, డిపో కంట్రోల‌ర్‌గా ప‌నిచేసిన నిసార్ కొన్ని ద‌శాబ్దాలుగా ప‌లు పాట‌ల‌తో ప్ర‌జా ఉద్య‌మాల‌కు ఊపునిచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ నాట్య‌మండ‌లి రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నారు. నిసార్ స్వ‌గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండ‌లంలోని సుద్దాల‌. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న స‌మాజం కోస‌మే పాటుప‌డ్డారు. తెలంగాణ సాధ‌న ఉద్య‌మంలో అనేక ధూంధాంలు నిర్వ‌హించారు.

ఇకపోతే , క‌రోనా బారిన ప‌డిన నిస్సార్ చికిత్స కోసం తిర‌గ‌ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు లేవ‌ని, ఎక్క‌డా చేర్చుకోలేద‌ని ఈయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజిరెడ్డి మీడియాకు ఆవేద‌న‌తో చెప్పుకొచ్చారు. చిట్ట చివరిగా గాంధీలో చేరితే వెంటిలేటర్‌ సదుపాయం లేక తెలంగాణ సాంస్కృతిక వార‌ధిగా నిలిచిన నిస్సార్ శాశ్వ‌తంగా ఈ లోకాన్ని విడిచాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. అలాగే తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు స్పందిస్తూ తెలంగాణ ఉద్యమ జ్వాలా గీతం వంటి నిస్సార్ కు కన్నీటి నివాళి అర్పిస్తున్నామన్నారు. ఓ గొప్ప క‌ళాకారుడు వైద్యం అంద‌క ప్రాణాలు కోల్పోవ‌డం అత్యంత విషాదం అని తెలిపారు!
Tags:    

Similar News