ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఏపీ - తెలంగాణలు అభివృద్ధిలో పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే...ఇరు తెలుగు రాష్ట్రాలు పలు ప్రతిష్టాత్మక ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. ప్రతి ఏటా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకింగ్స్ ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ&ప్రమోషన్(డీఐపీపీ) విడుదల చేస్తుంది. గత ఏడాది ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ - తెలంగాణలు సంయుక్తంగా ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాయి. అయితే, ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా - తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది. తెలంగాణ కన్నా ఏపీకి 0.09% వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో తమకు రెండో ర్యాంకు రావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని గణాంకాల్లో తప్పులున్నాయని....లేదంటే ఈ సారి కూడా ఏపీతో పాటు తాము కూడా మొదటి స్థానంలో నిలుస్తామని కేసీఆర్ అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలోని డీఐపీపీ అధికారులను తెలంగాణ అధికారులు సంప్రదించారు.
అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో గుర్రుగా ఉన్న కేసీఆర్ .... ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని తమ ఎంపీలను ఆదేశించారు. దీంతో, తాజాగా ఆ వ్యవహారంపై డీఐపీపీ స్పందించింది. ఆ ర్యాంకింగ్స్ విషయంలో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని డీఐపీపీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని చెప్పింది. వివిధ అంశాల్లో రాష్ట్రం చేపట్టిన సంస్కరణలు - పనితీరు పట్ల ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ వస్తుందని - దానిని బట్టి ఆయా రాష్ట్రాలు తమ పనితీరును గమనించుకోవచ్చని తెలిపింది. దీని వల్ల భవిష్యత్తులో మరింత మెరుగైన ర్యాంకు దక్కించుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందని చెప్పింది. తాజాగా, డీఐపీపీ ప్రకటనతో ఈఓడీబీ ర్యాంకుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.