టీడీపీ దుకాణం బంద్.. బీజేపీవైపు చూపు

Update: 2019-05-31 09:54 GMT
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే..ఓడిపోగానే ఫేటు మారిపోవడం జరుగుతుంటుంది. కొంతమంది గెలిచే పార్టీలోకి జంప్ చేసి ప్రతీసారి మంత్రి పదవులను పొందుతుంటారు. అందులో మన గంటా శ్రీనివాస్ రావు ఒకరు. నాడు ప్రజారాజ్యంలో చేరి అనంతరం కాంగ్రెస్ లో విలీనమైన పార్టీ నుంచి మంత్రి అయ్యారు. 2014 ముందర టీడీపీలో చేరి గెలిచి మంత్రి అయ్యారు. 2019లో జగన్ ఒప్పుకుంటే చేరేవారే.. కానీ జగన్ దగ్గర ఈ జంపింగ్ లు కుదరవు. అందుకే ఈసారి టీడీపీ నుంచి గెలిచినా ఆయన ఆ పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉండిపోయారు.

ఇక తెలంగాణలోనూ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన  టీడీపీ నేతలకు ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కామధేనువుగా కనిపిస్తోంది. అందుకే టీడీపీలో మిగిలిపోయిన నేతలందరూ ఇప్పుడు బీజేపీవైపే చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడం.. కిషన్ రెడ్డి ఏకంగా కేంద్రమంత్రి కావడంతో బీజేపీకి తెలంగాణలో క్రేజ్ పెరిగింది. బలపడాలని చూస్తోంది. అందుకే తెలంగాణలో బీజేపీకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.

తాజాగా ఢిల్లీలో తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడా సురేష్ రెడ్డిలు కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డిని కలిశారు. బీజేపీలో చేరడంపై కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు.

తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ అయ్యింది. ఏపీలో దారుణ ఓటమితో ఇక తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లినట్టేనని నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం టీడీపీ నేతలకు బీజేపీయే కల్పతరువుగా కనిపిస్తోంది.  ప్రస్తుతం టీడీపీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రెటరీగా పెద్దిరెడ్డి ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ టీడీపీని వీడి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.


Tags:    

Similar News