రీల్ కాదు రియల్: సౌదీలో ఈ ప్రేమకథలో ఎన్ని ట్విస్టులో

Update: 2020-12-22 02:30 GMT
చాలా ప్రేమకథలకు రీల్ కథలు ప్రేరణగా నిలుస్తాయి. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ రియల్ లవ్ స్టోరీ గురించి తెలిస్తే.. రీల్ ప్రముఖులు ఎవరో ఒకరు తమ తదుపరి సినిమాగా ప్లాన్ చేయటం ఖాయం. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగు ఈ ప్రేమకథలో ఎట్టకేలకు ప్రేమ సక్సెస్ అయ్యింది. ఈ లవ్ స్టోరీలో తెలంగాణ కుర్రాడు హీరో. హీరోయిన్.. సౌదీ అమ్మాయి. వారిద్దరి ప్రేమకథలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే అంశాలే కాదు.. ప్రేమ కోసం వారు పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. అష్టకష్టాల తర్వాత ఇటీవలే శుభం కార్డు పడిన ఈ ప్రేమకథలోకి వెళితే..

నిర్మల్ కు చెందిన 32 ఏళ్ల అజీమ్ అనే వ్యక్తి సౌదీకి వెళ్లాడు. ఉపాధి కోసం వెళ్లిన అతడికి జీజాన్ పట్టణంలో ఒక ఉన్నతాధికారి ఇంట్లో డ్రైవర్ గా పని దొరికింది. యజమానికి సంబంధించిన అన్ని పనులు చూసుకునేవాడు. ఈ క్రమంలోనే ఆ యజమాని కుమార్తె 29ఏళ్ల అమ్మాయికి అజీమ్ కు మధ్య ప్రేమ షురూ అయ్యింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ.. గల్ఫ్ చట్టాల ప్రకారం ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే.. సదరు యువతి తండ్రి ఆమోదం తప్పనిసరి. దీంతో.. కొత్త ప్లాన్ వేశారీ ప్రేమ జంట. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2018లో భారత్ కు వెళ్లిపోయాడు అజీమ్. అతడు వెళ్లిన కొన్నిరోజులకు కాలేజీ టూర్ లో భాగంగా ఒమన్ వెళుతున్నట్లు చెప్పిన ఆ యువతి ఇండియాకు వచ్చింది.

వారిద్దరు నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక వివాహాల చట్టం 1954 కింద పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. దీంతో.. తెలంగాణ పోలీసులు అజీమ్ పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే తన భర్తతో కలిసి భారత్ లో ఉండాలని అనుకుంటున్నట్లుగా సౌదీ యువతి కామారెడ్డి కోర్టులో చెప్పింది.

దీంతో యువతి తండ్రి సౌదీ వెళ్లిపోయారు. కొత్త దంపతులు నిజామాబాద్ లో కాపురం పెట్టారు. గర్భవతి అయ్యాక తల్లి తరఫు వారితో తరచూ మాట్లాడేది. ఒకసారి సౌదీ రావాలన్న వారి మాటతో ఆమె 2019లో భర్తతో కలిసి సౌదీలో అడుగు పెట్టింది. వారు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారో లేదో.. అక్కడి పోలీసులు అజీమ్ ను అరెస్టు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. భారతచట్టాల ప్రకారమే పెళ్లి జరిగినట్లుగా అతను చెప్పిన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు.

తన తల్లిదండ్రులే తన భర్తను జైలుపాలు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న ఆమె.. వారిని వ్యతిరేకించి.. భర్తను జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నించింది. అందుకోసం సౌదీలోని భారత ఎంబసీని ఆశ్రయించటంతో పాటు.. ఎన్నో ప్రయత్నాలు చేసింది. తాను ఉండే ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్డా నగరానికి వచ్చి పోరాడింది. చంటి బిడ్డను వెంట పెట్టుకొని రెండేళ్ల పాటు ఆమె చేసిన పోరాటం ఫలించింది. తాజాగా అజీమ్ విడుదల కావటంతో వారి ప్రేమకథ సుఖాంతమైంది. ఇప్పుడు వారు సౌదీలోనే ఉండి.. ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. వారి అన్వేషణ ఫలించాలని కోరుకుందాం.
Tags:    

Similar News