త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌రు రేసులో తెలుగు నేత‌లు!

Update: 2016-10-14 07:29 GMT
తమిళనాడులో ప‌రిస్థితులను కేంద్రం నిశితంగా గ‌మ‌నిస్తోంది. అక్క‌డ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత తీవ్ర అనారోగ్యంతో ఉండ‌డంతో రాజ‌కీయ ప‌రిస్థితులు చాలా సెన్సిటివ్ గా మారిపోయాయి. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం ఉన్న ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగ‌ర‌రావును కొన‌సాగించాలా లేదంటే కొత్త గ‌వ‌ర్న‌రును నియ‌మించాలా అన్న విష‌యంలో కేంద్రం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. అస‌లు రోశ‌య్య ప‌ద‌వీ కాలం ముగిసిన త‌రువాత పూర్తికాలపు గ‌వ‌ర్నరును నియ‌మిస్తార‌ని అంతా అనుకున్నా కూడా కేంద్రం అనూహ్యంగా మ‌హారాష్ర్ట గ‌వ‌ర్న‌రుగా ఉన్న విద్యాసాగ‌ర‌రావును ఇన్ ఛార్జిగా నియ‌మించింది. ఇప్పుడు ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుందామ‌నేస‌రికి ప‌రిస్థితులు మారిపోయాయి.

జ‌య‌ల‌లిత అనారోగ్యం పాలై చికిత్స నిమిత్తం ఆసుప్రతిలో చేరిన తదనంతర పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ నియామకంలో కేంద్రం ఆచితూచి అడుగు వేస్తోంది. తమిళనాడుకు కొత్త గవర్నర్‌ ను నియమించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఆగస్టులో నాటి గవర్నర్‌ రోశయ్య పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు తమిళనాడు గవర్నర్‌ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే.. తొలుత క‌ర్ణాట‌కకు చెందిన బీజేపీ నేత‌ను నియ‌మించాల‌ని కేంద్రం అనుకున్నా జ‌య‌ల‌లిత వ‌ద్ద‌న‌డంతో ఆగిపోయారు. ఆ త‌రువాత గుజ‌రాత్ లో ప‌ద‌వి కోల్పోయిన మాజీ సీఎం ఆనందిబెన్ ప‌టేల్ ను నియ‌మించాల‌ని అనుకున్నారు. కానీ, అదీ కాలేదు. ఇలాంటి త‌రుణంలో కేంద్రం మ‌రోసారి గ‌వ‌ర్న‌రు ప‌ద‌విపై ఆలోచిస్తోంది.

జ‌య‌ల‌లిత కోరుకున్న‌ట్లుగా ఆనందిబెన్ ప‌టేల్ ను నియ‌మించాలా.. లేదంటే కొత్త వ్య‌క్తుల‌ను నియ‌మించాలా అన్న‌ది కేంద్రం నిర్ణ‌యించుకోలేక‌పోతోంది. జ‌య ఆరోగ్యం ఎలా ఉండ‌బోతోందో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం... ప‌లు సందేహాలు వెల్లువెత్తుతుండ‌డంతో ఎలాంటి రాజ్యాంగ ప‌రిస్థితుల‌నైనా డీల్ చేయ‌గ‌లిగే సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ను త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌రుగా నియ‌మించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే... ఆ వ్య‌క్తి ద‌క్షిణాదికి చెందిన‌వారైతే బాగుంటుంద‌న్న ఉద్దేశంతో ఉన్నార‌ని... కానీ, ద‌క్షిణాదిలో త‌మిళ‌నాడుకు - క‌ర్ణాట‌క‌కు పొస‌గ‌క పోవ‌డంతో ఏపీ - తెలంగాణ‌ల‌కు చెందిన‌వారికే ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లుగా స‌మాచారం. పురంధేశ్వ‌రి - హ‌రిబాబు - కృష్ణంరాజు - ద‌త్తాత్రేయ‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ.. ద‌త్తాత్రేయ కేంద్రంలో మంత్రిగా ఉండ‌డంతో ఆయ‌న‌కు ఇస్తే ఈక్వేష‌న్లు మారుతాయి. దీంతో ఏపీ నేత‌ల‌కు కానీ.. లేదంటే విద్యాసాగ‌ర‌రావుకు పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించి ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో ఉన్న మ‌హారాష్ట్ర‌ను చంద్ర‌బాబు కోరిక మేర‌కు టీడీపీకి చెందిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు ఇవ్వొచ్చ‌ని టాక్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News