తెలుగోడి టాలెంట్: ఖర్చు రూ.30.. మైలేజీ 300 కి.మీ.

Update: 2022-06-03 04:28 GMT
చూసినంతనే సాదాసీదా యువకుడిలా కనిపించే ఈ తెలుగోడి టాలెంట్ తెలిస్తే నోట మాట రాదంతే.  గతంలో కారును కొనుగోలు చేసిన వారికి.. ఇప్పుడు పెట్రోల్.. డీజిల్ ధరల మంటతో కారు బయటకు తీయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి. అంతలా పెరిగిపోయిన ధరల నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ కార్లు రంగ ప్రవేశం చేశాయి. అయితే.. ఎప్పటిలానే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. అయినప్పటికీ ధైర్యం చేసి కొన్నా.. వాటి నిర్వహణ ఒక ఎత్తు. ఆ కారు మైలేజీ విషయంలో ఉండే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

అలాంటి వాటికి చెక్ చెప్పేలా ఖమ్మం జిల్లాకు చెందిన రాకేశ్ అనే యువకుడు తనదైన శైలిలో ఒక కారును రూపొందించాడు. ఈ కారుకున్న స్పెషాలిటీ.. అతి తక్కువ ధరకు భారీ మైలేజీని ప్రదర్శించే ఈ కారు గురించి తెలిస్తే.. నమ్మరంటే నమ్మలేని పరిస్థితి.

ఖమ్మం నగరానికి చెందిన ఈ కారు ఎలక్ట్రికల్ మోడల్ లో తయారు చేశారు. దీనికున్న మరో అద్భుత గుణం ఏమంటే.. కారును నడుపుతున్న వేళలోనూ.. కారు తనకు తాను ఛార్జ్ అయ్యేలా దీన్ని రూపొందించారు.

దీంతో.. ప్రయాణం చేస్తున్న కొద్దీ ఛార్జింగ్ తగ్గటం తర్వాత.. దానికదే ఛార్జి చేసుకోవటం ద్వారా ఎక్కువ మైలేజీకి కారణం కానుంది. ఈ కారును ఒకసారి ఛార్జి చేస్తే 5 నుంచి 10 యూనిట్లు ఖర్చు అవుతుంది.

పది యూనిట్లను తీసుకున్నా.. రూ.30 ఖర్చు అవుతుంది. కాదు కమర్షియల్ లెక్కలోకి వెళ్లినా.. యూనిట్ రూ.10 చొప్పున చూసినా రూ.100కు మించి ఖర్చు కాదు. కానీ.. ఛార్జింగ్ తర్వాత రోడ్డు మీదకు వెళ్లిన తర్వాత 300 కి.మీ. నాన్ స్టాప్ గా తిరగటం ఈ కారు స్పెషల్ గా చెప్పొచ్చు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కారును ఖమ్మం పట్టణంలోని పరేడ్ గ్రౌండ్ కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సహా పలువురు ప్రముఖులు.. ఆసక్తికరంగా పరిశీలించారు. ఇలాంటి కారును ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా లాంటి వారి కంట్లో పడితే.. ఈ టాలెంట్ కుర్రాడిని అభినందించటమే కాదు.. కొత్త తరహా ఆలోచనలు ప్రాణం పోసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News